Naga Chaitanya: ‘థ్యాంక్‌ యూ’... నన్ను చాలా మార్చింది!

నవతరానికి ప్రతిబింబంలా కనిపిస్తుంటారు... నాగచైతన్య. మనలో ఒకడిలా కనిపించే ఆయన ప్రేమకథల్లో ఇట్టే ఒదిగిపోతారు.

Updated : 20 Jul 2022 09:10 IST

నవతరానికి ప్రతిబింబంలా కనిపిస్తుంటారు... నాగచైతన్య (Naga Chaitanya). మనలో ఒకడిలా కనిపించే ఆయన ప్రేమకథల్లో ఇట్టే ఒదిగిపోతారు. భావోద్వేగాలతో కట్టిపడేస్తుంటారు. జీవితాలకి దగ్గరగా ఉండే కథలతో ప్రయాణం చేస్తున్న నాగచైతన్య ఇటీవల ‘థ్యాంక్‌ యూ’ (Thank You) చేశారు. విక్రమ్‌ కె.కుమార్‌ (Vikram K Kumar) దర్శకత్వం వహించిన ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకులు ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాగచైతన్య మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘థ్యాంక్‌ యూ’ చేయడానికి  ప్రేరేపించిన అంశాలేమిటి?

భావోద్వేగాలతో కూడిన అభిరామ్‌ పాత్ర ప్రయాణమే నాకు నచ్చింది. మనందరం కృతజ్ఞతతో మెలగాలని అతని ప్రయాణం చెబుతుంది. దర్శకుడు విక్రమ్‌, రచయిత బి.వి.ఎస్‌.రవి, నిర్మాత దిల్‌రాజు ఈ కథ గురించి చెప్పినప్పుడు నాలో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ఇలాంటి కథల్ని దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ చాలా బాగా డీల్‌ చేస్తుంటారు. ‘మనం’ సినిమాని ఓ కథలా చెప్పుకొంటే సింపుల్‌గానే ఉంటుంది. దాన్ని విక్రమ్‌ అల్లిన తీరు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులోనూ ఆ మేజిక్‌ కనిపిస్తుంది.

ఇందులో మూడు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారట కదా?

చూడటానికి మూడు కోణాలే అనిపిస్తాయి కానీ... 16 ఏళ్ల టీనేజ్‌ కుర్రాడిగా మొదలుకొని 36 ఏళ్ల వ్యక్తి వరకు నాలుగైదు దశల్లో ఆ పాత్ర కనిపిస్తుంది. నాకు శారీరకంగా, మానసికంగా పలు రకాలుగా సవాళ్లనిచ్చిన చిత్రమిది. దిల్‌రాజు సంస్థలో 12 ఏళ్ల తర్వాత చేసిన సినిమా ఇది.  

టీనేజర్‌ పాత్ర అనగానే నాగచైతన్య తప్ప మరొకరు గుర్తు రాలేదని దర్శకుడు చెప్పారు... దీనిపై మీ అభిప్రాయమేమిటి?

ఇప్పుడైతే టీనేజర్‌గా చేయగలను కానీ, ఇంకో మూడు నాలుగేళ్ల తర్వాత ఆ లుక్‌లో కనిపించలేను కదా (నవ్వుతూ). అయితే 16 ఏళ్ల కుర్రాడి లుక్‌ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ పాత్ర కోసం చాలా బరువు తగ్గాను. నిర్మాతలూ తగినంత సమయం ఇచ్చారు. మూడు నెలలపాటు ప్రత్యేకమైన కసరత్తులు చేయడంతోపాటు, హావభావాల పరంగా కొన్ని వర్క్‌షాప్స్‌ చేసి కెమెరా ముందుకెళ్లా. స్వతహాగా నాకు ఓ పాత్రలో ఇలాంటి వైవిధ్యాన్ని ఇష్టపడతాను. ఇందులో మహేష్‌బాబుకి అభిమానిగా కనిపిస్తాను. ఒక ప్రత్యేకమైన టైమ్‌లైన్‌లో నడిచే కథ కాబట్టి ఆ సమయంలో వచ్చిన మహేష్‌ సినిమాల్ని కవర్‌ చేస్తూ స్క్రీన్‌ప్లే సాగుతుంది.

ఇన్ని దశలతో కూడిన పాత్ర చేస్తుంటే ‘ప్రేమమ్‌’ రోజులు గుర్తుకొచ్చాయా?

‘ప్రేమమ్‌’లో మూడు దశల్లోని ప్రేమకథలు కనిపిస్తాయి. ఇది జీవితానికి సంబంధించిన కథ. ఈ సినిమాలో నటిస్తూ వ్యక్తిగా చాలా మారాను. నేనెక్కువగా మాట్లాడను. ఇంతకుముందు మనసులో ఉన్న విషయాల్ని సగమే బయటికి చెప్పేవాణ్ని. ఇప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఏదైనా అనిపిస్తే ఓపెన్‌గా చెప్పేస్తున్నా. మన తల్లిదండ్రులకీ థ్యాంక్‌ యూ చెప్పాలనుకున్నా మనం ఆగిపోతుంటాం. అది వాళ్లపైనున్న గౌరవంతోనే అయినా, కాసేపు దాన్ని పక్కనపెట్టి థ్యాంక్‌ యూ అని చెబితే మనసుకు చాలా బాగుంటుంది.

‘లవ్‌స్టోరి’, ‘లాల్‌సింగ్‌ చద్దా’, ‘థ్యాంక్‌ యూ’,  ‘దూత’ తీరిక లేకుండా ఉన్నట్టున్నారు?

ఇవన్నీ కరోనాకి ముందు ఒప్పుకొన్న సినిమాలే. ‘లాల్‌సింగ్‌ చద్దా’ ప్రాజెక్ట్‌  లాక్‌డౌన్‌ సమయంలో వచ్చింది. నెల రోజుల్లో రెండు సినిమాలు విడుదలవుతున్నాయంటే కారణం అదే. కొవిడ్‌ సమయంలో ప్రేక్షకులు రకరకాల సినిమాలు చూసి అభిరుచుల్ని మార్చుకున్నారు. ట్రైలర్‌ చూసే చిత్రం చూడాలో? వద్దో? నిర్ణయిస్తున్నారు. అందుకే ఇప్పుడు కథల ఎంపికలో నా ఆలోచనా తీరు మారింది.  

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఎలా ఉంటుంది?

నా స్టైల్‌లోనే సాగే ఓ మాస్‌ చిత్రం అది. సెన్సిబుల్‌గా సాగే ఓ తెలివైన కథ. ఇందులో నేను పోలీస్‌ అధికారిగా కనిపిస్తా. తను తీసిన ‘మానాడు’ నాకు బాగా నచ్చేసింది. ఆ సినిమా హక్కుల గురించి ఏవో సమస్యలు రావడంతో దాన్ని చేయలేకపోయా. ‘మానాడు’ (Maanaadu) కంటే ముందే వెంకట్‌ ప్రభు నాకు చెప్పిన కథతోనే ఇప్పుడు సినిమా చేస్తున్నా. అయితే ‘మానాడు’ కథని ఇప్పుడు రానా తీసుకున్నాడు.

పరశురామ్‌, తరుణ్‌ భాస్కర్‌లు కథలు చెప్పారట కదా, ఆ సినిమాలు ఎప్పుడుంటాయి?

పరశురామ్‌ ఈమధ్యే కలిశాడు. కథ గురించి మాట్లాడుకున్నాం. పూర్తిస్థాయి స్క్రిప్ట్‌తో వచ్చాక ఆ సినిమా ఎప్పుడనేది చెబుతాం. తరుణ్‌ భాస్కర్‌తోనూ ఓ కథ చర్చల్లో ఉంది. ‘ధూత’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.  హారర్‌ కథతో ఆ చిత్రం రూపొందింది.

* ‘‘ప్రేమకథలు, భావోద్వేగాలతో కూడిన కథల్లోనే ప్రేక్షకులు నన్ను చూడటానికి ఇష్టపడుతుంటారు. దాంతో వాణిజ్య ప్రధానంగా సాగే ఫార్మాట్‌కి నప్పుతానో లేదో అనే సందేహం వెంటాడుతూ ఉంటుంది. గతంలో యాక్షన్‌ కథలు ప్రయత్నించాను అవి అంతగా ఆకట్టుకోలేదు. అందుకే ‘బంగార్రాజు’ (Bangarraju) విషయంలో కొంచెం ఆలోచించాను. పైగా నాన్న పక్కన నటించేటప్పుడు చిన్న భయం ఉంటుంది. కొత్త దర్శకులతో సినిమాలు చేయకూడదనేమీ లేదు. గతంలో చాలానే చేశా. కానీ, అనుకున్న ఫలితాలు రాలేదు. అది వాళ్ల తప్పు కాదు. కథల ఎంపికలో నాలోనే ఇంకా పరిణతి పెరగాలనుకుంటున్నా’’.

* ‘‘కరోనా వల్ల ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని సినిమాని ఆస్వాదించడం అలవాటైంది. అందులో తప్పేమీ లేదు. సమయం అలా మార్చింది. ఇప్పుడు పరిశ్రమగా మేం దానికి తగ్గట్టుగా మారాలి. ప్రేక్షకుడిని మళ్లీ థియేటర్‌కి తీసుకురావాలంటే దానికి తగ్గట్టుగా కంటెంట్‌ సిద్ధం చేయాలి. మొన్న ‘విక్రమ్‌’ (Vikram) ఆదరణ పొందింది కదా? ట్రైలర్‌, టీజర్‌లోనే ఓ ప్రత్యేకతని ప్రదర్శించాలి. సినిమాపై పెట్టుబడి తీరూ మారాలి. అందరూ పారితోషికాల్ని లాభాల నుంచి తీసుకునేలా మాట్లాడుకోవాలి. ఓటీటీ వేదికల్లో విడుదల చేయడంపైనా అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలి’’.

* ‘‘ఆమిర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌సింగ్‌ చద్దా’ (Laal Singh Chaddha) కోసం చేసిన ప్రయాణం గుర్తుండిపోతుంది. ఆయన్ని చూస్తూనే మనం నేర్చుకుంటాం. ఈ సినిమా చిరంజీవి (Chiranjeevi) సమర్పణలో విడుదలవుతుండడం ఆనందంగా ఉంది. కొత్తగా హిందీ సినిమాలేవీ ఒప్పుకోలేదు. ముందు నన్ను ఆ ప్రేక్షకులు స్వీకరించాలి. అప్పుడే బాలీవుడ్‌ చిత్రాల గురించి ఆలోచిస్తా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు