యుద్ధభూమిలో ఎదురు చూస్తున్నా మిత్రమా!

కథానాయకులు హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలయికలో ‘వార్‌ 2’ చిత్రం పట్టాలెక్కనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 21 May 2023 02:52 IST

కథానాయకులు హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలయికలో ‘వార్‌ 2’ చిత్రం పట్టాలెక్కనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వార్తలకు బలం చేకూర్చేలా హృతిక్‌ ఓ ట్వీట్‌ చేశారు. శనివారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన కోసం యుద్ధభూమిలో ఎదురు చూస్తున్నాని పేర్కొన్నారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా!! నీకు ఈ ఏడాదంతా సంతోషంగా సాగాలని కోరుకుంటున్నా. యుద్ధ భూమిలో నీకోసం ఎదురు చూస్తున్నా మిత్రమా. రాబోయే రోజులు మీకు ఆనందం, శాంతితో నిండి ఉండాలని కోరుకుంటున్నా. మనం కలిసే వరకు..’’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు హృతిక్‌. దీనిపై తారక్‌ కూడా తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీరు రోజులు లెక్కపెట్టండి. ఈ నిరీక్షణ గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రపోతారని ఆశిస్తున్నా. యుద్ధభూమిలో త్వరలోనే కలుద్దాం’’ అని హృతిక్‌ ట్వీట్‌పై స్పందించారు. దీంతో ఈ ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. తారక్‌ - హృతిక్‌ ‘వార్‌ 2’లో కలిసి నటించడం ఖాయమంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

వచ్చే ఏడాది మార్చి నుంచి..

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కలయికలో రూపొందనున్న సినిమా ఇప్పటికే ఖాయమైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ‘ఎన్టీఆర్‌31’ వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ విషయాన్ని తారక్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని