సహస్రా... ఇది కలయా నిజమా!

సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా... అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. డాలిశ్య కథానాయిక. విజేశ్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి నిర్మాతలు. ‘కలయా నిజమా...’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని బుధవారం విడుదల చేశారు.

Published : 09 Jun 2023 00:33 IST

సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా... అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. డాలిశ్య కథానాయిక. విజేశ్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి నిర్మాతలు. ‘కలయా నిజమా...’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని బుధవారం విడుదల చేశారు. ప్రముఖ గాయని కె.ఎస్‌.చిత్ర ఆలపించిన ఈ పాటకి లక్ష్మీప్రియాంక సాహిత్యం సమకూర్చారు. మోహిత్‌ రెహమానిక్‌ సంగీతం అందించారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకి భిన్నమైన కథ ఇది. మూడేళ్లపాటు శ్రమించి, ఎన్నో కష్టాల్ని దాటి ఈ దశకి చేరుకున్నాం. చిత్ర, మోహిత్‌, లక్ష్మీప్రియాంక కలిసి ‘కలయా నిజమా...’ అంటూ సాగే ఓ అందమైన పాటని ఇచ్చార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సుధీర్‌ కొత్త లుక్‌తో సందడి చేస్తారు. మంచి బృందం కుదరడంతో ఓ మంచి సినిమాని చేశాం’’ అన్నారు. చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ ‘‘కథ వినగానే ఓ నవల చదివిన అనుభూతి కలిగింది. చాలా మలుపులున్న కథ ఇది. దర్శకుడు చాలా స్పష్టంగా తెరకెక్కించాడు. సుధీర్‌ చాలా యేళ్లుగా తెలుసు. తొలిసారి కలిసి నటించాం. కష్టపడి పైకొచ్చిన ఓ మంచి వ్యక్తి. ఈ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని చూస్తారు. తమిళంలో శివకార్తికేయన్‌లా తను విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.


దసరాకు ‘గణపత్‌’

టైగర్‌ ష్రాఫ్‌.. కృతి సనన్‌ కలిసి ‘హీరోపంటి’లో అలరించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో వికాస్‌ భళ్‌ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ‘గణపత్‌’. జాకీ భాగ్ననీ నిర్మిస్తున్నా ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. దసరా కనుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల యూకేలో షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ‘హీరో టైగర్‌ ష్రాఫ్‌ వచే వారం ముంబయిలో జరగబోయే షూటింగ్‌లో పాల్గొననున్నారు. కొన్ని ముఖ్యమైన భారీ సన్నివేశాలతో, తరవాత ఒక పాటతో ఈ చిత్రీకరణ పూర్తవుతుంది. దర్శకుడు నిర్మాణనంతర పనుల్లో బిజీగా ఉన్నారు. దసరాకు ఈ సినిమా అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉంది’ అని చిత్రబృందం తెలిపింది. కృతి సనన్‌ మాట్లాడుతూ..‘టైగర్‌ చాలా సున్నితమైన మనసు కలవాడు. తనలో నాకు అదే నచ్చుతుంది. నేను టైగర్‌తో కలిసి 2014లో ‘హీరోపంతీ’ చేశాను. మా ఇద్దరికి అదే మొదటి సినిమా. ఆ సినిమాతోనే బాలీవుడ్‌లో మా సినీజీవితాన్ని మొదలుపెట్టాము. తప్పకమీరు ఒక మంచి యాక్షన్‌ సినిమాని చూస్తారు’ అని అన్నారు.


అడవిలో అమ్మాయి

అప్సర రాణి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘తలకోన’. నగేశ్‌ నారదాసి దర్శకత్వం వహిస్తున్నారు. దేవర శ్రీధర్‌రెడ్డి నిర్మాత. స్వప్న శ్రీధర్‌ రెడ్డి సమర్పిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అడవి నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లిన ఓ అమ్మాయికి ఎలాంటి అనుభవం ఎదురైందనేది తెరపైనే చూడాలి. అడవి అనగానే ప్రకృతి అందాలే గుర్తొస్తాయి. కానీ ఇందులో మరో కోణాన్నీ చూపించాం.  రాజకీయాన్ని కూడా మేళవించాం. ప్రకృతికి విరుద్ధంగా వెళితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో ఆసక్తిని రేకెత్తించేలా చెప్పాం’’ అన్నారు. కథానాయిక మాట్లాడుతూ ‘‘మంచి స్క్రిప్ట్‌కి నేను అభిమానిని. మొదట్నుంచీ మంచి కథలనే ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నా. నేను చేసిన మరో మంచి చిత్రం ఇది’’ అన్నారు. ‘‘ఇటీవలే తలకోనలో జరిగిన చిత్రీకరణతో సినిమా పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’’న్నారు నిర్మాత.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని