Sankranthi Movies 2024: సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు

రవితేజ కథా నాయకుడిగా నటించిన ‘ఈగల్‌’ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 9న ఆ సినిమాని సోలోగా విడుదల చేయడానికి సహకరించాలనే ఒప్పందంపై నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 05 Jan 2024 06:54 IST

‘ఈగల్‌’ ఫిబ్రవరి 9కి వాయిదా
పోటీలేని విడుదలకి సహకరించాలని ఛాంబర్‌ నిర్ణయం

రవితేజ కథా నాయకుడిగా నటించిన ‘ఈగల్‌’ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 9న ఆ సినిమాని సోలోగా విడుదల చేయడానికి సహకరించాలనే ఒప్పందంపై నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచినట్టైంది. ఈ నిర్ణయం పరిశ్రమకి మేలు చేస్తుందని సినీ పెద్దలు చెప్పారు. ‘గుంటూరు కారం’, ‘హను-మాన్‌’, ‘సైంధవ్‌’,  ‘నా సామిరంగ’తోపాటు ‘ఈగల్‌’ చిత్రాలు ఈసారి సంక్రాంతి సందర్భంగా విడుదల తేదీల్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే దేనికీ తగినన్ని థియేటర్లు దొరకవనీ... ఆ ప్రభావం వసూళ్లపై బలంగా ఉంటుందనే ఆందోళన వ్యాపారవర్గాల్లో వ్యక్తమైంది. దీనిపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కలిసి  ఆయా నిర్మాతలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎవ్వరూ వెనక్కి తగ్గేలా కనిపించలేదు. దాంతో పోటీలో ఐదు సినిమాలు ఖాయం అనుకున్నారంతా. చివరిగా మరోమారు జరిపిన చర్చల్లో ‘ఈగల్‌’ వాయిదాకి నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌, కథానాయకుడు రవితేజ అంగీకారం తెలిపారు. దాంతో పరిశ్రమకి చెందిన సంస్థలు, ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘గత ఆరు నెలలుగా ఎవరికి వారు విడుదల తేదీల్ని ప్రకటిస్తూ వచ్చాం. మా ‘ఫ్యామిలీస్టార్‌’ చిత్రం వాయిదా పడ్డాక... ఐదు సినిమాలు బరిలో నిలిచాయి. దాంతో నిర్మాతల్ని సమావేశ పరిచి ఎవరికి వీలున్నా వాయిదాకి ప్రయత్నించండని కోరాం. మూడు రోజులుగా జరుపుతున్న చర్చలతో టి.జి.విశ్వప్రసాద్‌ తన ‘ఈగల్‌’ వాయిదాకి అంగీకారం తెలిపారు. వాణిజ్య మండలి నుంచి ఆ సినిమాకి పోటీలేని విడుదలకి సహకారం అందించాలని నిర్ణయించాం. అందుకు ఒప్పుకున్న కథానాయకుడు రవితేజ, నిర్మాతలు విశ్వప్రసాద్‌, వివేక్‌లకి కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ సమావేశంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి దామోదర్‌ప్రసాద్‌, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి అనుపమ్‌ రెడ్డి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల, వెంకట్‌ బోయనపల్లి, సునీల్‌ నారంగ్‌, శ్రీనివాసా చిట్టూరి, కె.నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని