Manchu Vishnu: తెలుగు సినిమా 90ఏళ్ల వేడుకలు మలేసియాలో

తెలుగు చలన చిత్ర పరిశ్రమ 90ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినిమా ఘన కీర్తిని చాటి చెప్పేందుకు ‘నవతిహి’ పేరుతో వేడుకలు నిర్వహించనుంది మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా). ఈ విషయాన్ని ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ప్రకటించారు.

Published : 24 Mar 2024 06:43 IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ 90ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినిమా ఘన కీర్తిని చాటి చెప్పేందుకు ‘నవతిహి’ పేరుతో వేడుకలు నిర్వహించనుంది మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా). ఈ విషయాన్ని ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా 90ఏళ్ల చరిత్రను ‘నవతిహి ఉత్సవం’ పేరిట ‘మా’ తరఫున ఘనంగా నిర్వహించనున్నాం. మలేసియాలోని కౌలాలంపూర్‌ వేదికగా జులై నెలలో ఈ వేడుకలు నిర్వహించనున్నాం. సినీ పెద్దలతో చర్చించి.. వారి ఆశీసులతో వేడుకలకు సంబంధించిన తేదీలను ప్రకటిస్తాం. ఈ మేరకు జులైలో చిత్రీకరణలకు మూడు రోజులు సెలవులు ఇవ్వాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్‌రాజును కోరాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ వేడుకల ద్వారా ఫండ్‌ రైజ్‌ చేసి, ఆ మొత్తాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ‘మా’ సభ్యుల కోసం ఉపయోగించనున్నాం. ‘మా’ ప్రస్తుతం దేశంలోని ఐదు అసోసియేషన్లతో ఒప్పందం చేసుకుంది. ఈ వేడుకలకు ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా కొందరు రానున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ స్వర్ణయుగంలో ఉంది. ఈ సమయంలో నటీనటులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. చిరంజీవికి పద్మవిభూషణ్‌ రావడం గర్వించాల్సిన విషయం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ఉపాధ్యక్షుడు మాదాల రవి, కోశాధికారి శివ బాలాజీ, పలువురు మలేసియా ప్రతినిధులు పాల్గొన్నారు.

‘మా’ భవనంపై ఎన్నికల తర్వాత ప్రకటన

ఎన్నికలు పూర్తయిన వెంటనే ‘మా’ భవనంకు సంబంధించి ఓ మంచి ప్రకటన రానుందన్నారు మంచు విష్ణు. ‘మా’ కార్యాలయం ఎక్కడ ఉండాలనే విషయంలో జనరల్‌ బాడీ సమావేశంలో చర్చించామని.. ‘మా’ సభ్యులంతా కొత్తగా నిర్మించనున్న ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యాలయంలోనే దాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌రాజుతో పాటు పలువురు సినీ పెద్దలతో చర్చించినట్లు చెప్పారు. వాళ్ల నిర్ణయం ఆధారంగా త్వరలో తాము ‘మా’ భవనంపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అలాగే ఇక ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టత ఇచ్చారు విష్ణు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు