Tollywood: తెలుగు దర్శకుల.. బాలీవుడ్‌ దండయాత్ర

పాన్‌ ఇండియా ట్రెండ్‌ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్‌.. టాలీవుడ్‌ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా..

Updated : 06 May 2024 09:34 IST

పాన్‌ ఇండియా ట్రెండ్‌ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్‌.. టాలీవుడ్‌ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. ఎక్కడ సినిమా తీసినా దేశమంతా ఆడించేసుకోవచ్చన్న భరోసా అందరిలోనూ ఏర్పడిపోయింది. అందుకే ప్రస్తుతం మన తెలుగు దర్శకులు మిగిలిన భాషల్లో మెరుపులు మెరిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పలువురు యువ దర్శకులు ఆశ్చర్యపరిచే కలయికలతో బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మరి ఉత్తరాదిలో జెండా పాతేందుకు సిద్ధమవుతున్న ఆ తెలుగు కెప్టెన్లు ఎవరు? వారి చిత్ర విశేషాలేంటి? చూసేద్దాం పదండి..

న తెలుగు దర్శకులు బాలీవుడ్‌ తారలతో కలిసి వెండితెరపై ప్రతాపం చూపించడమన్నది కొత్త పరిణామమేమీ కాదు. కాకపోతే ఇటీవల కాలంలో ఈ తరహా కలయికల జోరు పెరిగింది. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో తొలి అడుగులోనే తెలుగులో సత్తా చాటిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ జోరు చూపించారు. షాహిద్‌ కపూర్‌తో ‘కబీర్‌ సింగ్‌’, రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్‌’ సినిమాలు చేసి వరుస విజయాలందుకున్నారు. ఆ బాటలోనే ‘జెర్సీ’ రీమేక్‌తో గౌతమ్‌ తిన్ననూరి, ‘హిట్‌’ రీమేక్‌తో శైలేష్‌ కొలను, ‘ఛత్రపతి’ రీమేక్‌తో వి.వి.వినాయక్‌ బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ, వారి ప్రయత్నాలకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే ఇప్పుడు మరికొందరు తెలుగు దర్శకులు బాలీవుడ్‌లో తొలి అడుగులు వేసేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.

రణ్‌వీర్‌ - ప్రశాంత్‌ కలయికలో..

వైవిధ్యభరితమైన కథలకు చిరునామాగా నిలుస్తుంటారు ప్రశాంత్‌ వర్మ. ‘అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన.. ‘హను-మాన్‌’తో జాతీయ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌తో ఓ పాన్‌ ఇండియా చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో రణ్‌వీర్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతే కాదు దీనికి ‘రాక్షస్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ప్రశాంత్‌ దీంతోపాటు ‘హను-మాన్‌’కు కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ సినిమా చేయనున్నారు.

సన్నీ దేవోల్‌తో యాక్షన్‌ డ్రామా..

కొత్తదనం నిండిన మాస్‌ యాక్షన్‌ కథలతో సినీప్రియుల్ని మెప్పించడంలో ముందుంటారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ‘క్రాక్‌’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో వరుస విజయాలందుకుని జోరుమీదున్న ఆయన ఇప్పుడు హిందీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ‘గదర్‌ 2’తో హిట్టు కొట్టి జోరుమీదున్న సీనియర్‌ హీరో సన్నీ దేవోల్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఇదీ గోపీచంద్‌ శైలి యాక్షన్‌ డ్రామా కథాంశంతోనే తెరకెక్కనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు సమాచారం. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

వంశీతో షాహిద్‌?

‘మహర్షి’ విజయం తర్వాత తమిళ స్టార్‌ విజయ్‌తో కలిసి ‘వారసుడు’ సినిమా చేసి సత్తా చాటారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇప్పుడాయన బాలీవుడ్‌లో తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తను ఇప్పటికే షాహిద్‌ కపూర్‌కు ఓ కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. తెలుగు సినిమాల్ని హిందీలో డబ్బింగ్‌ చేసి విడుదల చేసే గోల్డ్‌మైన్‌ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో తెలుగు చిత్రసీమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది ఈ ఏడాదిలోనే పట్టాలెక్కనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

‘బేబి’..హిందీలోకి!

చిన్న చిత్రంగా విడుదలై.. గతేడాది బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘బేబి’ ఒకటి. విభిన్నమైన కల్ట్‌ ప్రేమకథతో సాయి రాజేశ్‌ తెరకెక్కించిన ఈ సినిమా యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం బాలీవుడ్‌లో పునర్నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిందీలోనూ సాయి రాజేశే తెరకెక్కించనున్నట్లు నిర్మాత ఎస్‌కేఎన్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రంతో ఓ స్టార్‌ కిడ్‌ వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని