Mahesh Babu: ఈసారి సంక్రాంతికీ బాగా గట్టిగా కొడతాం!

‘‘నాకయినా... నాన్నకయినా బాగా కలిసొచ్చిన పండగ సంక్రాంతి. మా సినిమా సంక్రాంతికి విడుదలయితే అది బ్లాక్‌బస్టరే.

Updated : 10 Jan 2024 10:39 IST

‘గుంటూరు కారం’ వేడుకలో మహేశ్‌బాబు

‘‘నాకయినా... నాన్నకయినా బాగా కలిసొచ్చిన పండగ సంక్రాంతి. మా సినిమా సంక్రాంతికి విడుదలయితే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం’’ అన్నారు మహేశ్‌బాబు. ఆయన కథానాయకుడిగా... త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు. మంగళవారం రాత్రి గుంటూరులో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గుంటూరులో వేడుక జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే తొలిసారి అనుకుంటా. దీనికి త్రివిక్రమ్‌కి కృతజ్ఞతలు చెప్పాలి. ఎక్కడ వేడుక జరుపుకోవాలా అని ఆలోచిస్తుంటే ఆయన మీ ఊళ్లో వేడుక చేద్దాం అన్నారు. త్రివిక్రమ్‌ సర్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు స్నేహితుడి కంటే ఎక్కువ, నా కుటుంబ సభ్యుడిలా ఉంటారు. గత రెండేళ్లుగా ఆయన ఇచ్చిన సహకారం, అందించిన బలం నేనెప్పటికీ మరిచిపోలేను. ఆయన సినిమాల్లో ఎప్పుడు చేసినా నా నటనలో ఓ మ్యాజిక్‌ కనిపిస్తుంటుంది.

‘గుంటూరు కారం’లోనూ అదే జరిగింది. ఓ కొత్త మహేశ్‌బాబుని చూస్తారు. దానికి ఆయనే కారణం. మా నిర్మాత ఎస్‌.రాధాకృష్ణకు ఇష్టమైన హీరోని నేనే. ఆయన మానిటర్‌ చూసినప్పుడు, ఎడిటింగ్‌ రూమ్‌లో చూస్తున్నప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు. ఒక నిర్మాత మొహంలో ఆనందం కలిగినప్పుడు ఆ అనుభూతే వేరబ్బా. మా కలయికలో ఇంకా గొప్ప సినిమాలు ఇలాగే చేస్తుంటాం. శ్రీలీల ఎంతో ప్రతిభావంతురాలు. చాలా రోజుల తర్వాత ఓ తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్‌ కావడం ఆనందంగా ఉంది. ఆ అమ్మాయితో డ్యాన్స్‌ చేయాలంటే మామూలు విషయం కాదు. కథానాయిక మీనాక్షి చౌదరి అడగ్గానే చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు కృతజ్ఞతలు.

తమన్‌ అంటే నాకు చాలా ఇష్టం. తను నాకొక సోదరుడితో సమానం. కుర్చీ మడతపెట్టి... పాట గురించి చెప్పగానే ఇంకేమీ ఆలోచించకుండా ఇచ్చారు. ఆ పాట చూస్తే థియేటర్లు బద్దలైపోతాయి. నాది 25 ఏళ్లు ప్రయాణం అయినట్టుగా ఇందాకా ఓ వీడియోని ప్రదర్శించారు. ఈ  పాతికేళ్లు ప్రేక్షకులు, అభిమానులు చూపించిన అభిమానం నేనెప్పటికీ మరిచిపోలేను. ఏటా పెరుగుతూనే ఉంది. మాటల్లేవు... ఏం చెప్పాలో నాకు తెలియదు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏమీ తెలియదు. మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. ఈ సంక్రాంతికి బాగా గట్టిగా కొడతాం. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది.  నాన్నగారు మన మధ్య లేనందువల్లేనేమో. ఆయన నా సినిమా చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనందమేసేది. ఆయన ఫోన్‌ కాల్‌ గురించి ఎదురు చూస్తుండేవాణ్ని. ఇకపై అవన్నీ మీరే చెప్పాలి (వేడుకకి హాజరైన ప్రేక్షకుల్ని ఉద్దేశించి). ఇక నుంచి మీరే అమ్మ, మీరే నాన్న. మీరే నాకు అన్నీ. మీ ఆశీసులు, అభిమానం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ వేడుక కోసం  గుంటూరు రావడానికి రెండు కారణాలున్నాయి. సినిమా పేరు ఒకటైతే, ఇందులోని రమణగాడు మీ వాడు, మనందరివాడు. అందుకే అందరి మధ్యలో ఈ వేడుక చేయాలని ఇక్కడికి వచ్చాం. గుంటూరు ప్రజల్ని కలవడానికి వచ్చారు మహేశ్‌. సూపర్‌స్టార్‌ కృష్ణ తెలుగు సినిమాలో విడదీయలేని అంతర్భాగం.అంత గొప్ప మనిషికి పుట్టిన మహేశ్‌ ఇంకెంత అదృష్టవంతులో. ఒక సినిమాకి వంద శాతం పనిచేయాలంటే రెండు వందల శాతం పనిచేసే కథానాయకుడు మహేశ్‌బాబు.’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి చౌదరి, శ్రీలీల, దిల్‌రాజు, ఎస్‌.రాధాకృష్ణ, రామజోగయ్యశాస్త్రి, తమన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని