భిన్నమైన పాత్రల్లో నటించడం నాకిష్టం: రష్మిక

 తెలుగు చిత్రసీమలో ‘ఛలో’ చిత్రంతో అడుగుపెట్టిన కథానాయిక రష్మిక మందన. ఆ తర్వాత ‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అనతి కాలంలోనే అగ్రకథానాయికలో జాబితాలో చేరిపోయింది.

Updated : 10 Apr 2021 19:31 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్రసీమలో ‘ఛలో’ చిత్రంతో అడుగుపెట్టిన కథానాయిక రష్మిక మందన. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అనతి కాలంలోనే అగ్రకథానాయికల జాబితాలో చేరిపోయింది. ఈ మధ్యే తమిళంలో కార్తీ సరసన ‘సుల్తాన్‌’ చిత్రంలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’లో నటిస్తోంది. ‘‘ప్రేక్షకులు నా నటన గురించి ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటా. అదే నన్ను వైవిధ్యమైన పాత్రల వైపు నడిపిస్తోంది. నటనలో నాకు ఎక్కువ అనుభవం లేదు. అందుకే ఓ వ్యక్తిగా భిన్నమైన పాత్రలు చేసినప్పుడు అవి ఎలా ఉంటాయో తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. ఒకే రకమైన కథల్లో నటించడం ఇష్టం ఉండదు. నేను నటించిన 'గీత గోవిందం', 'డియర్‌ కామ్రేడ్', ఇప్పుడు నటిస్తోన్న 'మిషన్ మజ్ను', 'గుడ్‌బై’.. ఇవన్నీ భిన్నమైనవి. ప్రేక్షకులు నన్ను విభిన్నమైన ప్రాతల్లో చూస్తున్నారు. అలా వారిని మెప్పించడం అంతా ఈజీ కాదు. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ప్రేక్షకులు వాటిని వివిధ భాషల్లో చూశారు. అందులో ఒకటి ‘డియర్‌ కామ్రేడ్'. ఈ చిత్రం పదికోట్ల వ్యూస్‌ సాధించిందని ఇటీవల తెలిసింది. ఇది చాలా పెద్ద విషయం. బాలీవుడ్‌ ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ దక్షిణాది సినిమా పాత్రల ద్వారానే గుర్తుపడతారు. ఆ విధంగానే భాషాపరమైన అడ్డంకులు తొలగిపోతున్నాయని తెలుసు. నేడు ప్రేక్షకులు మంచి కథ ఉన్న ఏ భాషా చిత్రాన్నైనా చూస్తున్నారు. నేను దక్షిణాది నటిని. ఇక్కడి సినిమాలు చేస్తున్నాను. కానీ బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నా. ఇప్పుడు భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతున్నాయి. కాబట్టి మంచి సినిమాల్లో నటించాలనుకుంటున్నా’’ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’లో నటిస్తోంది. సీనియర్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌తో ‘గుడ్‌బై’ చిత్రంలోనూ చేస్తోంది. దీని షూటింగ్ ఈ మధ్యే నడుస్తోంది. ఇక తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లోనూ చేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని