Prabhas: ఆ విషయం ఇప్పుడే బయటపెడితే.. వాళ్లు ఊరుకోరు: ప్రభాస్‌

చాలా సంవత్సరాల గ్యాప్‌ తర్వాత లవర్‌బాయ్‌ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్‌. ఆయన హీరోగా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా...

Published : 05 Mar 2022 10:26 IST

హైదరాబాద్‌: చాలా ఏళ్ల తర్వాత లవర్‌బాయ్‌ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్‌. ఆయన హీరోగా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చెన్నైలో ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ప్రభాస్‌ కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

అందుకే ఆ కాలం ఎంచుకున్నాం..: రాధాకృష్ణ

‘రాధేశ్యామ్‌’ కథ మొత్తం జ్యోతిష్యం, జాతకాల చుట్టూ తిరుగుతుంటుంది. ఇదొక అందమైన ప్రేమకథ. 70-80ల కాలంలోనే జ్యోతిష్యాన్ని ప్రజలు గట్టిగా నమ్మేవారు. అందుకే మేము ఆ కాలానికి అనుగుణంగా సినిమా తెరకెక్కించాం. లుక్స్‌, సెట్‌ డిజైన్లు.. ఇలా చెప్పుకొంటూ వెళ్తే.. అన్నీ ఆ కాలానికి సంబంధించినవే ఉంటాయి. ఈ వింటేజ్‌ ప్రేమకథను యూరప్‌లో చిత్రీకరిస్తే బాగుంటుందని ప్రభాస్‌ ఓసారి అన్నారు. అలా, మేము ఎక్కువశాతం షూట్‌ ఆ దేశంలోనే చేశాం.

అందరూ ముఖ్యమైన వారే..: ప్రభాస్‌

‘రాధేశ్యామ్‌’ తెరకెక్కించడంలో ప్రతిఒక్కరూ కీలకపాత్ర పోషించారు. రాధాకృష్ణ ఈ కథ చెప్పినప్పుడు నాకెంతో నచ్చేసింది. లవర్‌బాయ్‌గా ప్రేక్షకుల్ని అలరించాలనే ఉద్దేశంతో ఓకే అన్నా. సత్యరాజ్‌ ఈ సినిమాలో కీ రోల్‌ పోషించారు. ‘మిర్చి’తో మా అనుబంధం మొదలైంది. ఆ సినిమా సూపర్‌హిట్, ఆతర్వాత మేమిద్దరం ‘బాహుబలి’ చేశాం. అది బ్లాక్‌బస్టర్‌. ఇప్పుడిది మా కాంబోలో వస్తోన్న మూడో చిత్రం. ఇది కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నా. పూజాహెగ్డే.. తన లుక్స్‌తో ఈ చిత్రానికి మరింత గ్లామర్‌ తీసుకువచ్చారు. సినిమాలో మా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఆర్ట్‌ డైరెక్టర్‌, సెట్‌ డిజైనర్‌, డీవోపీ.. ఇలా ఒక్కరేమిటీ అందరూ కష్టపడి పనిచేశారు. ఇక, జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈచిత్రానికి మంచి సంగీతం అందించారు. తన మ్యూజిక్‌తో ప్రతి సీన్‌కి ప్రాణం పోశాడు.

అది ఇప్పుడే చెప్పలేను: ప్రభాస్‌ 

ప్రెస్‌మీట్‌లో భాగంగా ఓ విలేకరి.. ‘ప్రభాస్‌ గారూ.. విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరుని ఈ సినిమాలో చూపిస్తున్నామని చెబుతున్నారు కదా. మరి, ఆ రెండింటిలో ఏది గెలుస్తుంది’ అని ప్రశ్నించగా.. ‘‘కొన్నిరోజుల్లో మా సినిమా విడుదల. టికెట్‌ కొనుగోలు చేసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి ఆ విషయాన్ని మీరే తెలుసుకోండి. ఎందుకంటే, రూ.300 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. నేను మెయిన్‌ పాయింట్‌ రివీల్‌ చేసేస్తే నిర్మాతలు నన్ను అస్సలు ఊరుకోరు’’ అని ప్రభాస్‌ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని