Vasu Varma: డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయింది నేను కాదు: ‘జోష్‌’ దర్శకుడు

తాను డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయినట్లు ఓ వెబ్‌సైట్‌ వార్త రాసిందని, దాన్ని సరిదిద్దుకోవాలని ‘జోష్‌’ సినిమా దర్శకుడు విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.

Published : 25 Sep 2023 20:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జోష్‌’ (Josh) సినిమాతో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)ను హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు వాసు వర్మ (Vasu Varma). ఇండస్ట్రీలో ఇదే పేరుతో ఉన్న మరో వ్యక్తి డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌కాగా ఓ వెబ్‌సైట్‌ తన ఫొటోని ప్రచురించిందని, వీలైనంత త్వరగా పొరపాటును సరిదిద్దుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.

బయటకు వెళ్తే నా పరిస్థితేంటో అర్థం కావటం లేదు: దామిని

‘‘డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నేను అరెస్ట్‌ అయ్యానంటూ ఓ వెబ్‌సైట్‌ వార్త రాసింది. నా ఫొటోను ప్రచురించింది. అది నిన్న మధ్యాహ్నం నుంచి అంతటా కనిపిస్తుంది. దాన్ని చూసి స్నేహితులంతా నాకు ఫోన్‌ చేశారు. లైట్‌ తీసుకుని కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. కానీ, ఆ న్యూస్‌ ఆధారంగా ఇతర వెబ్‌సైట్లు నా గురించి వార్తలు రాశాయి. సోషల్‌ మీడియాలోనూ పలు పోస్ట్‌లు వైరల్‌ అయ్యాయి. ఆ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. సినిమా పనులతో నేను చాలా బిజీగా ఉన్నా. నా గురించి ఇలా ఎందుకు రాశారని ఆరా తీయగా నా పేరుతో మరో వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్నారని తెలిసింది. అది ఆయనకు సంబంధించిన న్యూస్‌ అనుకుంటున్నా. పొరపాటుగా రాసిన వారు దాన్ని సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాల విషయంలో చిత్ర పరిశ్రమలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కొందరు సినీ ఫైనాన్షియర్లుతోపాటు ‘బస్తీ’ సినిమా దర్శక, నిర్మాత మంతెన వాసు వర్మను మాదాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, వాసు వర్మ అరెస్ట్‌ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. మరోవైపు, హీరో నవదీప్‌ తెలంగాణ నార్కోటిక్‌ విభాగం పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. డ్రగ్స్ విక్రేత రామచందర్‌తో ఉన్న లింకులపై నవదీప్‌ను పోలీసులు ప్రశ్నించారు.

పలు హిట్‌ చిత్రాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌, కో- డైరెక్టర్‌గా పనిచేసిన వాసు వర్మ ‘జోష్‌’తో డైరెక్టర్‌గా మారారు. తర్వాత, సునీల్‌ హీరోగా ‘కృష్ణాష్టమి’ (2017) చిత్రం తెరకెక్కించారు. మధ్యలో కొన్ని చిత్రాలకు వేరే విభాగాల్లో పనిచేశారుగానీ దర్శకత్వం వహించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని