Kaikala Satyanarayana: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఈ వేకువజామున 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

Updated : 23 Dec 2022 10:40 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఈ వేకువజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కైకాల మృతితో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  కైకాల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

కృష్ణాజిల్లా కౌతవరం గ్రామంలో 1935న సత్యనారాయణ జన్మించారు. గుడివాడ కాలేజీలో ఆయన గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సత్యనారాయణలోని టాలెంట్‌ను ప్రముఖ నిర్మాత డీఎల్‌ నారాయణ గుర్తించి ‘సిపాయి కూతురు’లో అవకాశం ఇచ్చారు. పౌరాణికం, జానపదం, కమర్షియల్‌.. ఇలా ఎన్నో చిత్రాల్లో హీరో, విలన్‌గా ఆయన కనిపించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ తదితరుల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో సత్యనారాయణ నటించారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడి పాత్రల్లో ఆయన మెప్పించారు. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘శ్రీ కృష్ణ పాండవీయం’, ‘శ్రీకృష్ణావతారం’, ‘వరకట్నం’, ‘పాపం  పసివాడు’, ‘మానవుడు దానవుడు’, ‘యమగోల’, ‘సోగ్గాడు’, ‘సీతా స్వయంవరం’, ‘అడివి రాముడు’, ‘దానవీరశూర కర్ణ’, ‘కురుక్షేత్రం’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘అగ్నిపర్వతం’, ‘విజేత’, ‘కొండవీటి దొంగ’, ‘కొదమసింహాం’, ‘యమలీల’, ‘అరుంధతి’ చిత్రాల్లో ఆయన నటించారు. ‘మహర్షి’ తర్వాత ఆయన స్క్రీన్‌పై కనిపించలేదు. రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. లోక్‌సభ ఎంపీగానూ సేవలు అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని