koffee with karan: ‘కాఫీ విత్ కరణ్‌’కు క్రికెటర్లు.. కరణ్ ఏమన్నారంటే!

ప్రముఖ సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్ కరణ్‌’ ప్రస్తుతం 8వ సీజన్‌ ప్రసారమవుతోంది. దీనికి క్రికెటర్లను పిలవాలని అభిమానులు కోరుతున్నారు.

Published : 28 Oct 2023 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెరపై సూపర్‌ హిట్‌ అయిన కార్యక్రమం ‘కాఫీ విత్ కరణ్‌’. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్‌ జోహార్‌ (Karan Johar) హోస్ట్‌గా 2004లో ప్రారంభమైన ఈ షో ఏడు సీజన్లను పూర్తి చేసుకుని, ప్రస్తుతం 8వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. సినిమాల పరంగా కరణ్‌ జోహార్‌ ఎంత పాపులర్‌ అయ్యారో, ఈ షో ద్వారానూ అంతే సక్సెస్‌ అయ్యారు. ఇక ఈ సెలబ్రిటీ టాక్‌ షోలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాల్గొని సందడి చేస్తున్నారు. దీంతో కొందరు అభిమానులు ఈ కార్యక్రమానికి క్రికెటర్లను పిలవాలంటూ కరణ్‌ జోహార్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందించారు. క్రికెటర్లకు ఫోన్‌ చేయాలన్నా తనకు భయమని చెప్పారు.

తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న ఆయనను క్రికెటర్లను ఈ కార్యక్రమానికి పిలవాలని అభిమానులు కోరారు. దీనికి స్పందించిన కరణ్‌.. ‘వాళ్లు వస్తారా? క్రికెటర్లు ఈ షోలో పాల్గొంటే మీతో పాటు నాకు ఆనందమే. వాళ్లంతా నేషనల్‌ ఐకాన్స్‌. ఎంతో ఫేమస్‌. వాళ్లు నాఫోన్‌ తీస్తారో లేదో కూడా నేను చెప్పలేను. అసలు ఫోన్‌ చేయాలన్నా నాకు భయంగా ఉంటుంది. నేను క్రికెట్‌కు పెద్ద అభిమానిని. క్రికెటర్లపై ఎంతో గౌరవం ఉంది. అలాగే, నాకు నో చెప్పించుకోవడం ఇష్టం లేదు’ అంటూ వాళ్లు వస్తారో లేదో కచ్చితంగా చెప్పలేనని నవ్వుతూ సమాధానం చెప్పారు.

నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అది: చిరంజీవి స్పెషల్‌ పోస్ట్‌

ఇక ‘కాఫీ విత్ కరణ్‌ సీజన్‌ 6’కు ప్రముఖ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌-హార్దిక్‌పాండ్య (Hardik Pandya-KL Rahul)పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు మాత్రమే ఈ షోలో పాల్గొన్న క్రికెటర్లు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ఎపిసోడ్‌ను డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి తొలగించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సౌత్ సెలబ్రిటీలను కూడా పిలవాలంటూ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌ చేస్తున్నారు. రామ్‌ చరణ్ దంపతులను.. అలాగే, జూనియర్‌ ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌లను కలిపి పిలవండి అంటూ పోస్ట్‌లు పెడుతూ.. కరణ్‌ను ట్యాగ్‌ చేస్తున్నారు. దీనిపై కరణ్‌ ఏమంటారో వేచిచూడాలి. సాధారణంగా ఈ కార్యక్రమంలో ఎక్కువగా బాలీవుడ్‌ తారలే పాల్గొంటుంటారు. గతంలో సౌత్ నుంచి రానా, ప్రభాస్‌, రాజమౌళి వెళ్లారు. అలాగే సమంత కూడా ఓ ఎపిసోడ్‌లో సందడి చేసింది.

ఇక 8వ సీజన్‌ మొదటి ఎపిసోడ్‌లో (Koffee With Karan season 8) దీపికా-రణ్‌వీర్‌లు పాల్గొన్నారు. వాళ్ల ప్రేమ, పెళ్లికి సంబంధించిన సరదా ముచ్చట్లను పంచుకున్నారు. ఆ వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. దీంతో రెండో ఎపిసోడ్‌కు ఎవరు వస్తారా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి గురువారం డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఇది ప్రసారమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు