Chiranjeevi: నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అది: చిరంజీవి స్పెషల్‌ పోస్ట్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) తాజాగా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. తన కెరీర్‌లోని టర్నింగ్‌ పాయింట్‌ అదేనంటూ ఆయన తెలిపారు.

Updated : 28 Oct 2023 16:02 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ‘ఖైదీ’ (Khaidi) ఒకటి. 1983లో విడుదలైన ఈ చిత్రం చిరంజీవిని స్టార్‌ హీరో చేసింది. ‘ఖైదీ’ విడుదలై ఈ ఏడాదితో 40 ఏళ్లు అవుతోన్న సందర్భంగా చిరంజీవి ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. చిత్రబృందానికి, తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.

‘‘ఖైదీ’.. నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఇది విడుదలై నేటికి 40 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్‌, రచయితలు పరుచూరి సోదరులు, నా కో-స్టార్స్‌ సుమలత, మాధవీతోపాటు టీమ్‌ మొత్తాన్ని అభినందిస్తున్నా. గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అని చిరంజీవి తెలిపారు.

Pawan kalyan: భార్యతో కలిసి ఇటలీ బయల్దేరిన పవన్‌ కల్యాణ్.. ఫొటోలు వైరల్

1982లో విడుదలైన ‘ఫస్ట్‌ బ్లడ్’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని కోదండరామిరెడ్డి ‘ఖైదీ’ని తీర్చిదిద్దారు. పూర్తి స్థాయి యాక్షన్‌ కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులోని పాటలు ఎవర్‌గ్రీన్‌. మొత్తం ఐదు పాటలు ఉండగా, అన్నింటినీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల పాడటం విశేషం. ముఖ్యంగా ‘గోరింటా పూసింది’, ‘ఇదేమిటబ్బా..’ పాటలు క్లాస్‌ను విశేషంగా అలరించగా, ‘రగులుతోంది మొగలి పొద’ (Raguluthondi Mogali Poda) మాస్‌ జనాన్ని ఓ ఊపు ఊపేసింది. థియేటర్స్‌లో ‘వన్స్‌మోర్‌..’ అనిపించుకున్న పాటల్లో ఇదీ ఒకటి. ఇందులో మాధవి, చిరంజీవిల నాగినీ డ్యాన్స్‌ యువతను కట్టిపడేసింది. ఈ పాటకు సలీమ్‌ మాస్టర్‌ నృత్యాలను సమకూర్చగా, సహాయకుడిగా ఉన్న శివ శంకర్‌ మాస్టర్‌ దగ్గరుండి చిరంజీవికి సూచనలు చేశారు. ఇక ప్రముఖ నృత్య దర్శకుడు హీరాలాల్‌ కూడా ఈ పాటకు కొన్ని సూచనలు చేయడం గమనార్హం.

ఈ సినిమాను షూటింగ్‌కు 40 రోజుల సమయం పట్టింది. అక్టోబరు 28, 1983లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.8కోట్లు కలెక్ట్‌ చేసింది. ‘ఖైదీ’ని అదే పేరుతో హిందీ, కన్నడలోనూ దీనిని రీమేక్‌ చేశారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌ అమాంతం పెరిగింది. ‘ఖైదీ’ పేరు కలిసొచ్చేలా చిరంజీవి ‘ఖైదీ నెం.786’, ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాలను చేశారు. ఈ రెండూ కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక, ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. ‘భోళాశంకర్‌’ తర్వాత ఆయన వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని