Updated : 04 Dec 2021 11:51 IST

Lakshya: నాలాంటి అమ్మాయిలతో వేగడం కష్టం

‘‘నాకు భాష అనేది హద్దు కాదు. అలా అనుకుంటే తొలి చిత్రం తెలుగులో చేసేదాన్ని కాదు. నటిగా ప్రతీ భాషలోనూ నటించాలనుంది. అన్ని రకాల పాత్రలు పోషించాలనుంది’’ అంటోంది కేతిక శర్మ. ‘రొమాంటిక్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దిల్లీ అందం ఆమె. ఇప్పుడు ‘లక్ష్య’తో అలరించేందుకు సిద్ధమైంది. నాగశౌర్య కథా నాయకుడిగా నటించిన చిత్రమిది. సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు. ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది కేతిక శర్మ.  

‘‘కొవిడ్‌ పరిస్థితుల వల్లే నా సినిమాలన్నీ కాస్త ఆలస్యమయ్యాయి. ఇప్పుడవన్నీ వరుసగా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందాన్నిస్తోంది. ‘రొమాంటిక్‌’ చిత్రీకరణ ఆఖరి రోజునే.. దర్శకుడు సంతోష్‌ నాకు ‘లక్ష్య’ కథ వినిపించారు. ఇలా ఓ చిత్రం పూర్తికాగానే.. అలా మరో అవకాశం రావడం ఆనందంగా అనిపించింది. నా పాత్ర తొలి చిత్రంలో పోషించిన మౌనిక పాత్రకు భిన్నంగా ఉంటుంది. ఈ వైవిధ్యం వల్లే నేనీ సినిమా ఒప్పుకొన్నా. దీనికి తోడు విలువిద్య నేపథ్యంలో ఇంత వరకు పెద్దగా సినిమాలు రాలేదు. అది మన ప్రాచీన ఆట. పురాణాల్లోనూ ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంది. అందుకే కథ  వినగానే.. కచ్చితంగా చేయాలనిపించింది’’. 

* ‘‘ఈ సినిమాలో నేను రితిక అనే పాత్ర పోషించా. మనసుకు నచ్చినట్లుగా జీవించే అమ్మాయి తను. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. అలాగే చాలా ఎమోషనల్‌. పెళ్లి చేసుకోవాలని తాపత్రయ పడుతుంటుంది. కథ మొత్తం నాగశౌర్య చుట్టూనే తిరుగుతుంటుంది. ఆయనిందులో పార్థు అనే పాత్రలో కనిపిస్తారు. శౌర్య చాలా కష్టపడ్డారు. వృత్తిపట్ల అంత నిబద్ధతతో వ్యవహరించే నటుడితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నేనెంతో మంది ఆర్చర్లను కలిశాను. కొంచెం నేర్చుకున్నాను’’. 

*‘‘నా మూడో చిత్రం వైష్ణవ్‌ తేజ్‌తో చేస్తున్నాను. అదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కాలేజీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఉంది. అలాగే మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి’’.


రితిక పాత్ర నా నిజ జీవితానికి కాస్త దగ్గరగా ఉంటుంది. నేనూ తనలాగే మనసుకు ఏమనిపిస్తే అది చేసేస్తుంటా. అలాగని రితికలా పెళ్లి విషయంలో తాపత్రయమేమీ లేదు. నిజానికి నాలా మనసుకు నచ్చినట్లు జీవించే వాళ్లతో వేగడం కాస్త కష్టమే. భరించలేరు. నేను స్విమ్మింగ్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపాను. మా అమ్మ జాతీయ స్థాయి స్విమ్మర్‌. నాకు స్విమ్మింగ్‌ బేస్డ్‌ సినిమా వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. నా జీవితంలో ఒకే ఒక్క కల ఉండేది. నటిని అవ్వాలని. ఆ కల నెరవేరింది. అదెలా  జరిగిందో నాకూ తెలియదు. అమ్మానాన్న వైద్యులు. ఇండస్ట్రీలోకి వెళ్తానన్నప్పుడు.. నిరూపించుకోవడానికి ఒక్క ఏడాదే టైమ్‌ ఇస్తామన్నారు. అదృష్టవశాత్తూ అంతలోనే పూరి జగన్నాథ్‌ సర్‌ వల్ల నటిగా మారారు’’.


 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని