mansion 24 review telugu: ఓంకార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మ్యాన్షన్‌ 24’ ఎలా ఉంది?

mansion 24 review telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘మ్యాన్షన్‌ 24’ ఎలా ఉందంటే?

Updated : 18 Oct 2023 16:02 IST

Mansion 24 Review; వెబ్‌సిరీస్‌: మ్యాన్షన్‌ 24, నటీనటులు: వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రావు రమేష్‌, సత్యరాజ్‌, శ్రీమాన్‌, అవికా గోర్‌, మానస్‌ నాగులపల్లి, రాజీవ్‌ కనకాల, అభినయ, నందు, బిందు మాధవి, తులసి, అర్చనా జాయిస్‌, అమర్‌ దీప్‌ చౌదరి తదితరులు; సంగీతం: వికాస్‌ బాడిస; సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్‌; నిర్మాత: ఓం కార్‌, అశ్విన్‌ బాబు, కళ్యాణ్‌ చక్రవర్తి; దర్శకత్వం: ఓం కార్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

బాక్సాఫీస్‌ వద్ద ఒక్కోసారి ఒక్కో ట్రెండ్‌ నడుస్తుంది. అలా ఓ వెలుగు వెలిగిన జానర్‌ హారర్‌-కామెడీ. ఈ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు ఓంకార్‌. ‘రాజుగారి గది’  చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి జానర్‌తోనే ప్రేక్షకులను అలరించడానికి ‘మ్యాన్షన్‌ 24’ అంటూ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారాయన. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించడంతో ఈ సిరీస్‌ ఆసక్తిని పెంచింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? (mansion 24 review telugu) ‘మ్యాన్షన్‌ 24’తో భయపెట్టారా?

కథేంటంటే: అమృత (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. ఆమె తండ్రి కాళిదాసు (సత్యరాజ్‌) ఆర్కియాలజీ విభాగంలో పనిచేస్తూ ఒకరోజు కనిపించకుండా మాయమైపోతాడు. కాళిదాస్‌ అన్వేషణలో విలువైన సంపద దొరకడంతో దాన్ని పట్టుకుని పారిపోయాడని వార్తలు వస్తాయి. దీంతో అతడిని అందరూ దేశద్రోహి అంటూ అవమానిస్తుంటారు. ఈ వార్తలు తెలిసి, అమృత తల్లి(తులసి) మంచాన పడుతుంది. తన తండ్రి నిర్దోషి అని నిరూపించడంతో పాటు,  కనిపించకుండాపోయిన ఆయనను కనుగొనేందుకు అమృత రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలోనే చివరిగా తన తండ్రి ఓ పాడుబడిన మ్యాన్షన్‌కు వెళ్లాడని తెలుసుకుని, అక్కడకు వెళ్తుంది. దానికి వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటాడు రావు రమేష్‌. అలా వెళ్లిన అమృతకు వాచ్‌మెన్‌ ద్వారా ఆ మ్యాన్షన్‌ గురించి కొన్ని ఊహించని విషయాలు తెలుస్తాయి. ఇంతకీ అవేంటి? అందరూ చెబుతున్నట్లు అందులో దెయ్యాలు ఉన్నాయా?(mansion 24 review telugu) ఇంతకీ కాళిదాసు ఏమయ్యాడు? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఓంకార్‌ తీసిన ‘రాజుగారి గది’ చిత్రాల సిరీస్‌ పూర్తిగా దెయ్యాల చుట్టూనే తిరుగుతుంది. అయితే, వాటిలో కామెడీతో పాటు, ఒక సోషల్‌ మెస్సేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘మ్యాన్షన్‌ 24’ది కూడా అదే ఫార్మాట్‌. కాకపోతేఇది ఎలా సాగుతుందంటే, ‘రాజుగారి కొడుకులు.. ఏడు చేపల’ కథ మాదిరిగా ఉంటుంది. ‘చీమ చీమ ఎందుకు కుట్టావు’ అని తెలుసుకోవాలంటే, ఆ కథ మొత్తం వినాల్సిందే. కాళిదాసు ఏమైపోయాడో తెలుసుకోవాంటే ‘మ్యాన్షన్‌’లోని గదులు, అందులో నివసించిన వారు ఏమైపోయారో ముందు తెలుసుకోవాలన్నట్లు చూపించారు. దర్శకుడు ఓంకార్‌ చేసిన ఒక మంచి పని ఏంటంటే, మొదటి పది నిమిషాల్లోనే ప్లాట్‌ పాయింట్‌కు వచ్చేశారు. కనిపించకుండాపోయిన తన తండ్రి కోసం ఒక కుమార్తె సాగించే అన్వేషణ అని అర్థమైపోతుంది. దీనికి అనుగుణంగా మ్యాన్షన్‌ వాచ్‌మెన్‌ అయిన రావు రమేష్‌తో అందులో జరిగిన సంఘటలను చెప్పించే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ విక్రమార్కుడు, భేతాళ కథల్లా సాగుతాయి. (mansion 24 review) ‘జీవితంలో ఎదురయ్యే ప్రతి మనిషి ప్రశ్నతోనే మనకు పరిచయం అవుతాడు. ఆ పరిచయమైన వ్యక్తుల్లో కొందరు ప్రశ్నగానే మిగిలిపోతారు. లేదా మనల్ని జవాబులేని ప్రశ్నలుగా మిగిల్చిపోతారు’ అంటూ రావు రమేష్‌తో చెప్పించిన సంభాషణ వింటే తర్వాత ఏం జరుగుతుందో ఒక సగటు ప్రేక్షకుడిగా ఊహించవచ్చు. రోజూ అమృత మ్యాన్షన్‌కు రావడం వాచ్‌మెన్‌ చెప్పే కథలు వినడం, చనిపోయిన వారి వెనుక ఏం జరిగిందో తనదైన విశ్లేషణ చేస్తూ, ఆ కథకు ముగింపు ఇవ్వడం. అయితే, కథల్లో బలమైన ఎమోషన్‌, ట్విస్ట్‌లు లేకపోవడంతో అవన్నీ తేలిపోయినట్లు అనిపిస్తాయి.

ప్రతి కథలోనూ ఒక పాత్రతో ఇంకో పాత్రను ఇంటర్‌లింక్‌ చేయడం మాత్రం బాగున్నా, ఫక్తు దెయ్యాల సినిమాల్లో చూపించే ఎఫెక్ట్‌లే కనిపిస్తాయి తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. గదుల్లో లైట్లు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ కావడం గజ్జెల శబ్దాలు, ముఖానికి తెల్లటి రంగు పూసుకుని కనిపించే దెయ్యాలు. కొన్నేళ్లుగా వెండితెరపై కనిపించిన అవే దెయ్యాలు ఇందులోనూ దర్శనమిస్తాయి. అయితే, ప్రతి కథలోనూ ఒక్కో సమస్యను ఓంకార్‌ ప్రస్తావించారు. పిల్లలపై ద్వేషం, వివాహేతర సంబంధంతో కట్టుకున్న భార్య/భర్త, బిడ్డల్నే హతమార్చడం, చనిపోయిన వ్యక్తి కోసం ఆత్మహత్య చేసుకోవడం, మనుషులను ముక్కలుగా నరికి ఆనందం పొందే సైకోలు. ఇలా ప్రతి కథను, నేటి సమాజంలో ప్రతిబింబించిన వాస్తవాలనే చూపించారు. (mansion 24 review telugu) అదే సమయంలో ప్రతి కథను క్లుప్తంగా చెప్పడంతో పాటు, అనవసరంగా హారర్‌ను కామెడీ చేయలేదు. పూర్తిగా హారర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టారు. అలాగని అతిగా భయపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. కాళిదాసు ఏమయ్యాడో చెప్పే చివరి ఎపిసోడ్‌ మాత్రం రొటీన్‌గా ఉంటుంది. గతంలో చాలా సినిమాలు ట్రెండ్‌ను ఫాలో అయ్యాయి. మనం ముందు చెప్పుకొన్నాం కదా.. ‘చీమ చీమ ఎందుకు కుట్టావు’ అన్న పాయింట్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. దీంతో ఒక సగటు దెయ్యం సినిమా చూశామన్న ఫీలింగ్‌ తప్ప, బలమైన ఎమోషన్‌ ఏమీ ఉండదు. కాకపోతే, అసలు విషయం బయటపడిన తర్వాత వచ్చే ఆఖరి ట్విస్ట్‌ ఆసక్తికరంగా ఉంది. ఇదే రెండో సీజన్ కోసం బాటలు వేసింది. దీంట్లో తన సోదరుడు అశ్విన్‌ కూడా ఉంటాడని ఇటీవలే ఓంకార్‌ స్వయంగా ప్రకటించడం గమనార్హం.

ఎవరెలా చేశారంటే: ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ అమృతగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ కనిపించారు. ఇలాంటివి ఆమెకు కొత్తేమీ కాదు. ‘నాంది’ తరహాలో ఇందులోనూ నిజాన్ని, తన తండ్రిని అన్వేషించే సగటు అమ్మాయిగా కనిపించారు. రావు రమేష్, సత్యరాజ్‌, అభినయ ,రాజీవ్‌ కనకాల, అవికా గోర్‌ , మానస్‌ నాగులపల్లి,’ కేజీయఫ్‌’ ఫేం అర్చనా జాయిస్‌ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. రాజీవ్‌ కనకాల పాత్ర చూస్తే, ఈ సిరీస్‌ మొదలు పెట్టి చాలా నెలలే అవుతోందని అర్థమవుతోంది. (mansion 24 review telugu) ఎందుకంటే ఇటీవల ఆయన ముఖంలో వచ్చిన మార్పును స్పష్టంగా గమనించవచ్చు. అయితే, వరలక్ష్మి శరత్‌కుమార్‌, సత్యరాజ్‌లాంటి వారి పాత్రలను పూర్తి స్థాయిలో వాడుకోలేదేమో అనిపిస్తుంది. కథ మొత్తం వాళ్లు కేంద్రంగా నడిచినా, ఉప కథల కారణంగా వారి పాత్రలు తెరపై కనిపించేది తక్కువ కావడంతో వాటి ప్రభావం పెద్దగా కనిపించదు.

సాంకేతికంగా ఎలా ఉంది: ‘రాజుగారి గది’ ఫార్మాట్‌లోనే ఓంకార్ దీన్ని మలిచారు. అక్కడ గది చుట్టూ తిరిగే, ఇక్కడ మ్యాన్షన్‌ అందులోని గదులు చుట్టూ తిప్పారు. కాకపోతే, ప్రతి కథను సూటిగా చెప్పడంతో పెద్దగా సాగదీసినట్లు అనిపించదు. అయితే, ఆ కథను, ప్రేక్షకులను ఎమోషనల్‍గా కనెక్ట్ చేయడంలో మాత్రం ఫెయిల్‌ అయ్యారు. వికాస్ బాడిస సంగీతం ఈ సిరీస్‌కు అదనపు ఆకర్షణ తెచ్చింది. చాలా సన్నివేశాలను ఎలివేట్‌ చేసింది నేపథ్య సంగీతమే. సినిమాటోగ్రాఫర్ బి.రాజశేఖర్ ప్రతి సీన్‌ను ఆసక్తికరంగా మలిచారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

కుటుంబంతో కలిసి చూడొచ్చా: నిరభ్యంతరంగా చూడొచ్చు. పిల్లలతో కూడా కలిసి చూడొచ్చు. ఎక్కడా అసభ్యతకు తావులేదు. దెయ్యాలున్నా అవేవీ అంత భయపెట్టేవి కావు. ప్రతి ఎపిసోడ్‌ నిడివి దాదాపు 30 నిమిషాలకు అటూ ఇటూగా ఉంది. ఈ దసరా సెలవుల్లో టైమ్‌ పాస్‌ కోసం ఏదైనా హారర్‌ థ్రిల్లర్‌ చూడాలంటే ‘మ్యాన్షన్‌ 24’ చూడొచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు, పలు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + నిడివి
  • + ఓంకార్ దర్శకత్వం
  • + నటీనటులు
  • బలహీనతలు
  • - బలమైన ఎమోషన్స్‌ లేకపోవడం
  • - రొటీన్‌ దెయ్యాల ఫార్మాట్‌
  • చివరిగా: ‘మ్యాన్షన్‌ 24 ’ మరో టైమ్‌పాస్‌ దెయ్యాల కథ mansion 24 review telugu
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని