Roja: పార్టీ విలీనం చేసి మీరు లబ్ధి పొందారు.. ప్రత్యేకహోదాపై పోరాడలేదేం.. చిరుపై రోజా కామెంట్స్‌

Roja comments: అగ్ర కథానాయకుడు చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రులు రోజా, అంబటి రాంబాబు మాట్లాడారు.

Updated : 09 Aug 2023 17:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిరంజీవి (Chiranjeevi) కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టారని, అప్పుడు ఆయన ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయలేదని ఏపీ మంత్రి రోజా (Roja) ప్రశ్నించారు. ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా పడతారేంటి’ అంటూ చిరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ మంత్రులు, వైకాపా నాయకులు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా మాట్లాడారు.

వైకాపా నాయకులకు నాగబాబు కౌంటర్‌.. ఆకాశం మీద ఉమ్మాలనుకుంటే..!

‘‘చిరంజీవిగారు ఏ సందర్భంలో మాట్లాడారో నాకు తెలియదు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో పాటు మంత్రులెవరూ సినిమా వాళ్ల రెమ్యునరేషన్‌ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సినిమాకు ఎంత ఇస్తారో పవన్‌కల్యాణే స్వయంగా చెప్పుకొంటారు. మేము కూడా ఆర్టిస్టులం. సినిమాలు చేసేటప్పుడు వాటికే పరిమితం కావాలి. రాజకీయాల్లో ఉంటే అవే చూసుకోవాలి. సినిమా వేదికలపై రాజకీయాలను ముడిపెట్టి, ప్రభుత్వంపై కావాలని దుమ్మెత్తి పోసే వ్యక్తి పవన్‌కల్యాణ్‌. చిరంజీవి ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే, ఆయన సోదరుడికి ఇస్తే బాగుంటుంది. ‘బ్రో’ సినిమాలో మంత్రి అంబటి పాత్రను పెట్టి అవమానించారు. ప్రత్యేక హోదా, సంక్షేమం గురించి జగన్‌ మోహన్‌రెడ్డి ఆలోచించాలని చిరంజీవి అంటున్నారు. మీరు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ సమయంలో ప్రత్యేక హోదా కోసం మీరెందుకు పోరాడలేదు. ఎవరికో సలహాలు ఇవ్వటం కాదు. మీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మీరు లబ్ధి పొందారు. మీరు చెబితే విని చేయాలనే పరిస్థితిలో జగన్‌ మోహన్‌రెడ్డి లేరు.  చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని పవన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే, మీరొక ఇండస్ట్రీ పెద్దగా ఉండి, మీ తమ్ముడికి బుద్ధి చెప్పడం మానేసి, రాజకీయాలు మాట్లాడటం మంచి పరిణామం కాదు’’ అని రోజా వ్యాఖ్యానించారు.

తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి: అంబటి

ఇక చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి అంబటి కూడా మాట్లాడారు. ‘‘చిరంజీవి గారంటే నాకు గౌరవం. సామాన్య కుటుంబంలో పుట్టి పైస్థాయికి వచ్చారు. మరి సినిమా వాళ్లు నాపై బ్రహ్మాస్త్రం వేయొచ్చా. ‘బ్రో’ సినిమా నేనే వదిలేశా’ అని అందులో నటించిన హీరోనే స్వయంగా చెబుతుంటే, ఈయన ఎందుకు మాట్లాడుతున్నారు? తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి. చిరంజీవికి రాజకీయాలతో సంబంధం లేదని నేను అనుకుంటున్నా. ఏదైనా ఉంటే కాంగ్రెస్‌తో కాస్తో కూస్తో సంబంధం ఉంది. నన్ను ఎవరైనా అంటే, తలవంచుకుని పోయే నైజం కాదు. దాని వల్ల నాకు లాభం, నష్టం ఏదైనా జరగవచ్చు.  ‘బ్రో’ సినిమాలో రాంబాబు పాత్ర పెట్టారని వాళ్లు ఒప్పుకోరు. నేను సినిమా ఇండస్ట్రీపై పోరాటం చేసే పరిస్థితిలో నేను లేను. అది అసలు నా సబ్జెక్ట్‌ కాదు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. నాకు చాలా పనులు ఉన్నాయి. ‘బ్రో’ వ్యవహారం ముగింపునకు వచ్చిందనుకుంటే మళ్లీ అన్నయ్య మాట్లాడారు. నాపై వాళ్లేదో సినిమా తీస్తానని అన్నారు. అది చూశాక, మా సినిమా ప్రారంభిస్తాం’’ అని అంబటి రాంబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు