Naga babu: వైకాపా నాయకులకు నాగబాబు కౌంటర్‌.. ఆకాశం మీద ఉమ్మాలనుకుంటే..!

Naga babu: చిరంజీవి వ్యాఖ్యలపై వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నటుడు, జనసేన నాయకుడు నాగబాబు స్పందించారు. ట్విటర్‌ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

Updated : 09 Aug 2023 15:57 IST

హైదరాబాద్‌: రాష్ట్ర అభివృద్ధి, ఇతర విషయాలను ఆలోచించకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి’ అంటూ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రులు, వైకాపా నాయకులు విలేకరుల సమావేశం పెట్టి, మరీ చిరు వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేశారు. అయితే, వైకాపా నాయకుల వ్యాఖ్యలకు అటు చిరు, ఇటు పవన్‌ స్పందించలేదు. తాజాగా వారి సోదరుడు, నటుడు, జనసేన నాయకుడు నాగబాబు (Naga babu) స్పందించారు. ట్విటర్‌ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

రజనీ స్ఫూర్తితోనే చిరు రీఎంట్రీ.. ఇప్పుడు ఏకంగా బాక్సాఫీస్‌ వద్ద పోటీ..!

‘‘శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అణా పైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్‌లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్రపరిశ్రమ.. అయితే నిజం మాట్లాడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు. ఆయన ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు. అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదు. బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి  అనుకుంటున్నారా..? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగలలేదనుకుంటున్నారు..! మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుంది. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి ఎండ్‌కార్డ్‌ దగ్గర్లోనే ఉంది. నోట్‌: కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది... ఆరోగ్యాలు జాగ్రత్త’’ అంటూ ట్విటర్‌ వేదికగా గట్టి సమాధానం ఇచ్చారు.

‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.  అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..’’ అని చురకలు అంటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని