Salaar: ‘సలార్‌’ టికెట్‌ ధరల పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’. ఈ సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు  అనుమతి ఇచ్చాయి.

Updated : 19 Dec 2023 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘సలార్‌’ (Salaar) టికెట్‌ ధరల పెంపునకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. తెలంగాణలో  మల్టీప్లెక్స్‌ల్లో రూ.100, సింగిల్‌ థియేటర్లలో రూ.65 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతించింది. ఏపీలో టికెట్‌ ధరను రూ.40 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 

అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు, భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల విషయంలో నిబంధనల మేరకు మొదటివారం టికెట్‌ ధరలను పెంచుకునేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘సలార్’ను తెలుగులో విడుదల చేయనున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ విజ్ఞప్తి చేయగా... సినిమా విడుదలైన రోజు (డిసెంబరు 22) నుంచి డిసెంబరు 28 వరకు టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలోని 20 థియేటర్లలో మాత్రమే అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్‌ షోకు అనుమతి ఇచ్చింది. సాధారణ ప్రదర్శనలతోపాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి ఆరో ఆట ప్రదర్శించుకోవచ్చని పంపిణీదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆయన లేకపోతే ‘సలార్‌’ లేదు..: ప్రశాంత్ నీల్‌

ఏపీలో రూ.40 (సాధారణ థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో) పెంచుకునేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన పది రోజుల వరకే పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు షోలకు అనుమతి ఇవ్వలేదు. ప్రభాస్‌ హీరోగా ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రమిది. శ్రుతిహాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషించారు. బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథతో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే టికెట్ల విక్రయాలు ప్రారంభం కావడంతో హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో బారులుతీరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని