Sandeep Vanga: నేను చిన్నపిల్లాడిలా ఏడవాలని అనుకోవడం లేదు..: నెపోటిజం పై సందీప్ వంగా ఘాటు వ్యాఖ్యలు

బాలీవుడ్‌లోని నెపోటిజం గురించి సందీప్‌ వంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Published : 19 Jan 2024 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్‌’తో సూపర్‌ హిట్‌ను అందుకొని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సందీప్ వంగా (Sandeep Reddy Vanga). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజంపై విమర్శలు చేశారు. ‘కబీర్‌ సింగ్‌’ సినిమా సమయంలోను తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ‘బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వాళ్లు సొంత వారిని ప్రమోట్‌ చేసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. వాళ్లకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే అణిచివేయాలని చూస్తారు. ఈ విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. అవార్డు కార్యక్రమాల్లో ఇది అందరికీ అర్థమవుతుంది. గత నాలుగేళ్లలో నాకు ఎదురైన అనుభవాలు చెప్పాలంటే రెండు రోజులు పడుతుంది. వాటిని అందరితో పంచుకొని చిన్నపిల్లాడిలా ఏడవాలనుకోవడం లేదు’ అని చెప్పారు.

‘యానిమల్‌’ (Animal) సినిమాకు కొందరు కావాలనే నెగెటివ్ రివ్యూలు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ‘ముంబయిలో కొందరు వ్యక్తులు దర్శకుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ల చిత్రాలను ప్రశంసిస్తూ రివ్యూలు రాస్తారు. వాళ్లందరూ నా సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాల గురించే మాట్లాడతారు తప్ప చిత్రబృందం ఎంత కష్టపడిందో రాయరు. సినిమా ఓపెనింగ్స్ గురించి కూడా ఎక్కడా పేర్కొనరు. వాళ్లకు వాటి గురించి అవగాహన కూడా ఉండదు. ‘యానిమల్‌’కు కూడా ‘3 గంటల చిత్రహింస’ అని రాశారు. దాన్ని చూశాక వాళ్లకు సినిమాల గురించి ఏం తెలియదని అర్థమైంది’ అన్నారు.

‘గుంటూరు కారం’.. ఆ విషయం ముందే చెప్పాల్సింది: నాగవంశీ

సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్‌ హీరోగా తెరకెక్కిన ‘యానిమల్‌’ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో ఏకంగా 19 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని