Pushpa: ‘పుష్ప’ రిలీజ్‌పై వీడిన సందిగ్ధత.. విడుదల ఎప్పుడంటే..

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో...

Published : 03 Dec 2021 20:30 IST

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. క్రిస్మస్‌ కానుకగా మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ తరుణంలో ‘పుష్ప’ హిందీ వెర్షన్ రిలీజ్‌పై గత కొన్నిరోజుల నుంచి సందిగ్ధత నెలకొని ఉన్న విషయం తెలిసిందే. సినిమా విడుదల చేసేందుకు పంపిణీ దారులు సముఖంగా లేరన్న వార్తలూ చక్కర్లు కొట్టాయి. ఈనేపథ్యంలో తాజాగా ‘పుష్ప’ బీటౌన్‌ రిలీజ్‌పై శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ముందు అనుకున్న విధంగానే అన్ని భాషలతోపాటు హిందీలోనూ డిసెంబర్‌ 17నే ‘పుష్ప’ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గోల్డ్‌మైన్స్‌ టెలీఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఈ సినిమా హిందీ ప్రేక్షకుల్ని పలకరించనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బన్నీ అభిమానులు సంతోషిస్తున్నారు.

సాధారణంగా అల్లు అర్జున్‌ చిత్రాలకు బాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఆయన నటించిన చాలా సినిమాలు హిందీలోకి డబ్‌ అయి యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి. ఆయనకున్న క్రేజ్‌ దృష్టిలో ఉంచుకునే ‘పుష్ప’ మేకర్స్ పాన్‌ ఇండియా విడుదలకు సిద్ధమయ్యారు. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే.. ఇందులో బన్నీ ఊరమాస్‌ లుక్‌లో పుష్పరాజ్‌గా భయపెట్టనున్నారు. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సునీల్‌, అనసూయ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈసినిమా నిర్మాణాంతర పనుల్లో ఫుల్‌ బిజీగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని