Aliabhat: మెరుపుల తార.. తళుకుల చీర

అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్‌ అగ్రనాయిక అలియా భట్‌ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్‌ వేదిక ‘మెట్‌ గలా’లో ఆమె చీరలో మెరిసింది.

Updated : 08 May 2024 09:38 IST

‘మెట్‌ గలా’ వేదికపై అలియా సందడి

అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్‌ అగ్రనాయిక అలియా భట్‌ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్‌ వేదిక ‘మెట్‌ గలా’లో ఆమె చీరలో మెరిసింది. అమెరికా న్యూయార్క్‌ నగరంలో తాజాగా జరిగిన ఈ వేడుకలో ఫ్లోరల్‌ శారీలో ఆమె ఎర్రతివాచీపై నడుస్తుంటే ఆహుతుల నుంచి చప్పట్లు మార్మోగిపోయాయి. కెమెరాల చూపులు ఆమెపైనే నిలిచాయి. ఫ్యాషన్‌, సినిమా, వ్యాపార రంగాలకు చెందినవారు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వేడుకలో.. గతంలో పాల్గొన్న భారతీయ కథానాయికలు పాశ్చాత్య స్టైల్‌కే మొగ్గు చూపేవారు. వారికి భిన్నంగా అలియా ఈసారి భారతీయత ఉట్టిపడేలా చీరతో కనువిందు చేయడం పట్ల అటు అభిమానులు, ఇటు సినీ పరిశ్రమ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై మన సంస్కృతికి ఆమె నిలువుటద్దంలా మారిందని పొగడ్తల్లో ముంచెత్తారు. ఈ వేడుకలో పాల్గొనే ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ట్రాన్స్‌పరెంట్‌ చీర మేలిమి డిజైన్‌ మాత్రమే కాదు. సున్నితమైన పనితనం, కష్టతరమైన నైపుణ్యం, అపురూపమైన సంప్రదాయానికి ప్రతీక’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఈవెంట్‌లో గతంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, దియా మెహతా, నటాషా పూనావాలా తదితరులు ఎర్ర తివాచీపై నడిచే అవకాశం దక్కించుకున్నారు. దీపిక పదుకొణె ఈసారి కూడా హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో తప్పుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. అలియా వాసన్‌ బాలా తెరకెక్కిస్తున్న ‘జిగ్రా’లో కనిపించనుంది. ఆమెకి జోడీగా వేదాంగ్‌ రైనా నటిస్తున్నాడు.


ఎన్నో ప్రత్యేకతలు

ఈ తెలుపు రంగు తళుకుల చీర, రవికెలను ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ రూపకల్పన చేశారు. దీనిపై ఎంబ్రాయిడరీ కోసం 163 మంది చేయి తిరిగిన కళాకారులు 1,965 గంటలపాటు పని చేశారట. ‘మెట్‌ గలా’లో ఈసారి ‘గార్డెన్‌ ఆఫ్‌ టైమ్‌’ని థీమ్‌గా ఎంచుకున్నారు. దానికి అనుగుణంగానే అలియా పొడవైన చీర కొంగుపై పూలు, చెట్ల కొమ్మలను డిజైన్‌ చేశారు. వీటికితోడు బెంగాలీ రాజసం ఉట్టిపడేలా వజ్రాలు, టర్మలైన్స్‌, నీలాలు, పచ్చలతో కూడిన ఆభరణాలను అలియా ధరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని