
Saamanyudu: ఎదురు తిరగకపోతే చంపేస్తారు
‘‘నేనొక సామాన్యుణ్ని. ఎదురు తిరగకపోతే నన్ను చంపేస్తారు’’ అంటున్నారు విశాల్. ఇప్పుడాయన కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘సామాన్యుడు’. నాట్ ఏ కామన్ మ్యాన్.. అన్నది ఉపశీర్షిక. తు.ప.శరవణన్ తెరకెక్కించారు. డింపుల్ హయాతి కథానాయిక. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో విశాల్ ఓ కామన్ మ్యాన్‌గా కనిపించనున్నారు. ఓ క్రైమ్ కథను చెప్పిస్తూ.. విశాల్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆసక్తి కరంగా ఉంది. ‘‘తన ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే దారిలేక హత్య చేసే వాడికి, మిగతా వాళ్లను చంపి తను బతకాలని అనుకునే వాడికి చాలా తేడా ఉంది. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే.. దాన్ని ఏ యాంగిల్‌లో చూస్తున్నామన్నదే ఓ మంచి పోలీస్ ఆఫీసర్‌కు ఉండే ముఖ్యమైన అర్హత అని నేను అనుకుంటున్నాను’’ అంటూ వినిపించిన సంభాషణ సినిమా నేపథ్యమేంటో తెలియజేస్తుంది. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. సినిమాలో యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. విశాల్, డింపుల్‌ల కెమిస్ట్రీ, యోగిబాబు వినోదం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం: కెవిన్ రాజా.