అలా ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా?: కంగన

బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయనది ఆత్మహత్యని, హత్య కాదని ఎయిమ్స్‌ శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోరడంతో సుశాంత్‌ పోస్టుమార్టం నివేదికను పునఃపరిశీలించిన ప్రత్యేక బృందం ‘నటుడిది హత్య’ అని వస్తున్న ఆరోపణల్ని కొట్టివేసింది.

Published : 04 Oct 2020 01:32 IST

ముంబయి: బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయనది ఆత్మహత్యని, హత్య కాదని ఎయిమ్స్‌ శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోరడంతో సుశాంత్‌ పోస్టుమార్టం నివేదికను పునఃపరిశీలించిన ప్రత్యేక బృందం ‘నటుడిది హత్య’ అని వస్తున్న ఆరోపణల్ని కొట్టివేసింది. ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు, గాట్లు లేవని స్పష్టం చేసింది. దీనిపై నటి కంగనా రనౌత్‌ స్పందించారు. అతడి మరణం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

‘యువకుడు, నైపుణ్యం ఉన్న స్టార్‌ ఓ రోజు ఉదయం నిద్రలేచి, తన ప్రాణాల్ని తానే బలి తీసుకోడు. తనని బెదిరించారని, తన జీవితం ప్రమాదంలో ఉందని సుశాంత్‌ స్వయంగా చెప్పాడు. చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వడం లేదని, మూవీ మాఫియా తనను నిషేధించిందని, వేధించిందని పేర్కొన్నాడు. తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలన్నీ అవాస్తవమని, వాటి వల్ల మానసికంగా కుంగిపోయానని అన్నాడు’ అంటూ కంగన ‘ఎయిమ్స్‌’ను ట్యాగ్‌ చేశారు.

మరోపక్క సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్ ఎయిమ్స్‌ నివేదిక వెల్లడించిన తర్వాత ‘మేం గెలవబోతున్నాం..’ అని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ‘ఎటువంటి పరిస్థితుల్లోనూ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు’ అని ఇదే సందర్భంగా రియా చక్రవర్తి న్యాయవాది అన్నారు. జూన్‌ 14న ముంబయిలోని తన ఇంట్లో సుశాంత్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు పరిశీలించారు. డ్రగ్స్‌ చాటింగ్‌ జరిగిందని గుర్తించారు. దీంతో ఎన్సీబీ రంగంలోకి దిగి...రియాతోపాటు 16 మందిని అరెస్టు చేసింది. ఆమె బెయిల్‌ మంజూరు దరఖాస్తుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. రియా డ్రగ్స్‌ తన ఇంట్లో భద్రపరిచి, సుశాంత్‌కు ఇచ్చేవారని.. ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే కేసు విచారణకు సమస్యలు ఏర్పడతాయని ఎన్సీబీ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని