పర్యాటక వీసా.. విసిగి వేసారేలా

.. ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌ మహమ్మారి శాంతించింది.. విదేశాలు ఆంక్షలు సడలించాయి.. విమానాలు అన్ని దేశాలనూ చుట్టివస్తున్నాయి.. రెండున్నరేళ్లపాటు ఇతర దేశాలకు వెళ్లలేని వారిలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. విదేశీ అందాలు చూసొద్దాం..

Updated : 27 Aug 2022 09:49 IST

యూరప్‌ దేశాలకు వెళ్లాలంటే 2 నెలలపాటు తప్పని ఎదురుచూపులు
గణనీయంగా పెరిగిన విమాన ఛార్జీలు, హోటళ్ల అద్దె
దేశీయ పర్యాటకం వైపు దృష్టి
ఈనాడు, హైదరాబాద్

హైదరాబాద్‌ వాసి రవీంద్రనాథ్‌ విహారయాత్రకు కుటుంబంతో పాటు గ్రీస్‌ వెళ్లాలనుకున్నాడు. పర్యాటక వీసా కోసం ప్రయత్నిస్తే నెల, నెలన్నర సమయం పడుతుందన్నారు. ఆయన యాత్రను రద్దు చేసుకున్నారు.

కాంచనలక్ష్మి కుటుంబం అప్పుడప్పుడు సరదాగా సింగపూర్‌, దుబాయ్‌ వంటి దేశాలకు వెళ్లి వస్తుంటుంది. ఈసారి థాయ్‌లాండ్‌ వెళ్లాలనుకుంది. విమాన టికెట్లు, హోటల్‌ గదుల ధరలు ఎక్కువగా ఉండటంతో బడ్జెట్‌ భారీగా అవుతోంది. టూర్‌ ఆపరేటర్‌ను అడిగితే రెండు, మూడు నెలల తర్వాత ప్లాన్‌ చేసుకోమని సలహా ఇచ్చాడు.

.. ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌ మహమ్మారి శాంతించింది.. విదేశాలు ఆంక్షలు సడలించాయి.. విమానాలు అన్ని దేశాలనూ చుట్టివస్తున్నాయి.. రెండున్నరేళ్లపాటు ఇతర దేశాలకు వెళ్లలేని వారిలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. విదేశీ అందాలు చూసొద్దాం.. అంటూ పర్యాటకులు సిద్ధం అవుతున్నారు. ఏ నెలలో వెళ్లాలి.. ఏయే దేశాలు చూసిరావాలి.. బడ్జెట్‌ ఎంతవుతుంది.. ఇలా లెక్కలేసుకుని పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాక షాక్‌ తగులుతోంది. గతంలో ఏ దేశానికైనా ఒకట్రెండు వారాల్లో పర్యాటక వీసా దొరికేది. కానీ, ఇప్పుడు యూరప్‌ దేశాలకు వెళ్లాలంటే కనీసం నెల, రెండు నెలలు ఆగాల్సివస్తోంది. అమెరికాకు గరిష్ఠంగా 500, న్యూజిలాండ్‌కు 200 రోజులు పడుతోంది. ఫలితంగా సింగపూర్‌, మలేసియా, థాయ్‌లాండ్‌, వియత్నాం వైపు చూస్తున్నారు. అమెరికా, యూరప్‌లకు వెళ్లాలనుకునేవారు ప్రస్తుతానికి ఉత్తర, ఈశాన్య భారత్‌లోని పర్యాటక ప్రాంతాల వైపు దృష్టిసారిస్తున్నారు.

విమానఛార్జీలు డబుల్‌!

విదేశాలతో పాటు దేశంలోని పర్యాటక ప్రాంతాలకు విమాన టికెట్ల ధరలు కొవిడ్‌ ముందుకంటే రెట్టింపు అయ్యాయని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. హోటళ్లలో గదుల అద్దెలూ పెరిగాయి. కొవిడ్‌ సమయంలో వచ్చిన నష్టాల్ని పూడ్చుకోవడం ఒక కారణం అయితే.. పర్యాటకుల తాకిడి హఠాత్తుగా పెరగడమూ మరో కారణమని అంటున్నారు. బ్యాంకాక్‌కు గతంలో రానుపోను విమాన టికెట్లు 18-20వేలకు దొరికేవి. ఇప్పుడు 40వేల వరకు ఖర్చవుతోంది. సిక్కింకు విమాన టికెట్‌ రూ.4వేలకు దొరికేది. అదీ రెట్టింపైంది.


భారత్‌లో పర్వత పర్యాటక ప్రాంతాలకు

- కె.రంగారెడ్డి, తెలుగు రాష్ట్రాల ఛైర్మన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌

తొలిసారి పర్యాటక వీసాతో అమెరికా, యూరప్‌ దేశాలకు వెళ్లేవారికి వీసా అపాయింట్‌మెంట్‌ దొరకడానికి చాలా సమయం పడుతోంది. అలాంటివాళ్లు దేశంలో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌, సిక్కిం రాష్ట్రాల్లోని పర్వత పర్యాటక ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఆస్ట్రేలియా, జపాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక వంటి దేశాలకు ఎప్పుడంటే అప్పుడు వెళ్లొచ్చు.


వియత్నాం.. సరికొత్త ఆకర్షణ

- ఎన్‌.ఎస్‌.ఎన్‌.మోహన్‌, అధ్యక్షుడు-స్కాల్‌ ఇంటర్నేషనల్‌, హైదరాబాద్‌

కొవిడ్‌తో ఇన్నాళ్లూ పర్యాటకుల్ని అనుమతించని దేశాలు ఇప్పుడు వారిని స్వాగతిస్తుండటంతో ఔత్సాహికులు ఒక్కసారిగా ముందుకొస్తున్నారు. ఫలితంగా పర్యాటక వీసాలకు ‘నిరీక్షణ వ్యవధి’ పెరుగుతోంది. యూరప్‌లో ఫ్రాన్స్‌, ఇటలీ దేశాలకు పర్యాటక వీసాలకు స్లాట్లు దొరకట్లేదు. విదేశీ పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తుండటంతో వియత్నాంకు భారీగా వెళుతున్నారు. దానికైతే నాలుగైదు రోజుల్లోనే పర్యాటక వీసా ప్రక్రియ పూర్తవుతోంది.


హైదరాబాద్‌-వియత్నాం.. నేరుగా విమానం

- వాల్మీకి హరికిషన్‌, టూరిజం కమిటీ ఛైర్మన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

ర్యాటక వీసాల లభ్యతలో సౌలభ్యంతో వియత్నాంకు ఎక్కువమంది వెళుతున్నారు. మా ఏజెన్సీ నుంచి గ్రీసు వెళదామనుకున్న 36 మంది ఆలస్యం అవుతుందన్న కారణంతో టూరు రద్దు చేసుకున్నారు. పర్యాటకులు బాగా వస్తుండటంతో ఆ దేశం విమానాల సంఖ్య పెంచుతోంది. హైదరాబాద్‌ నుంచి వియత్నాంకు నేరుగా విమానాన్ని అక్టోబరు నుంచి నడపబోతోంది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌కూ సెప్టెంబరులో విమానం ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని