Maratha reservation: ‘మరాఠా కోటా’ ఆందోళనలు.. రాజీనామా సమర్పించిన ఇద్దరు శిందేవర్గం ఎంపీలు

మరాఠా వర్గానికి రిజర్వేషన్లు (Maratha reservation) కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఇద్దరు శిందే వర్గానికి చెందిన శివసేన ఎంపీలు రాజీనామా చేశారు. 

Published : 30 Oct 2023 23:34 IST

ముంబయి: మరాఠా వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు (Maratha reservation) కల్పించాలంటూ మహారాష్ట్రలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శిందే వర్గానికి చెందిన ఇద్దరు శివసేన ఎంపీలు రాజీనామా చేశారు. హింగోళి ఎంపీ హేమంత్‌ పాటిల్‌ తన రాజీనామా లేఖను లోక్‌సభ సెక్రటేరియట్‌లో అందజేయగా.. నాసిక్‌ ఎంపీ హేమంత్‌ గాడ్సే తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేకు పంపించారు. 

ఫడణవీస్‌ రాజీనామా చేయాలి.. సూలే డిమాండ్

‘లోక్‌సభ స్పీకర్‌ ప్రస్తుతం తన కార్యాలయంలో అందుబాటులో లేరు. అందుకే నా రాజీనామాను ఆయన కార్యాలయ సెక్రటరీకి అందజేశాను. అందుకు సంబంధించిన రశీదును కూడా తీసుకున్నానని’ పాటిల్‌ మీడియాతో అన్నారు. మరాఠా రిజర్వేషన్‌ ఆందోళనకారులు పాటిల్‌ను యావత్మల్‌ వద్ద అడ్డగించారు. రిజర్వేషన్లపై ఆయన వైఖరేంటో తెలపాలని పట్టుబట్టారు. దాంతో పాటిల్‌ అక్కడికక్కడే తన రాజీనామాను సిద్ధం చేసి ఆందోళనకారులకు అందజేశారు. 

అయితే తన రాజీనామాను శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎంపీ, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే స్టంట్‌గా అభివర్ణించడంపై పాటిల్‌ స్పందించారు. ‘నేను గాంధీ-నెహ్రూ కుటుంబంలో పుట్టలేదు. వారు రెండు, మూడు తరాలు అధికారంలో ఉన్నారు. కోటా మంజూరు చేయడానికి వారు చొరవ తీసుకోవాల్సింది’ అని పాటిల్‌ పేర్కొన్నారు. మరాఠా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉన్న నాయకులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరాఠా సామాజిక వర్గం నేతలు పలువురు ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఆ సామాజిక వర్గానికి దక్కింది శూన్యమని అన్నారు. 

మరోవైపు నాసిక్‌లో నిరాహార దీక్ష చేస్తున్న నిరసనకారులు సైతం రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టం చేయాలని మరో ఎంపీ గాడ్సేను కోరారు. దాంతో ఆయన సైతం తన రాజీనామా లేఖను సీఎం శిందేకు పంపించారు. వీలైనంత తర్వగా ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని అందులో విన్నవించారు. ‘గత కొన్ని సంవత్సరాలు మరాఠా సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం పోరాడుతోంది. గతంలో ఇచ్చిన రిజర్వేషన్లను కోర్టు నిలుపుదల చేసింది. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ అంశంపై దృష్టి సారించారు. దాన్ని మరాఠా సంఘం సభ్యులు ఓ భరోసాగా భావించారని’ లేఖలో గాడ్సే పేర్కొన్నారు. మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ సామాజిక కార్యకర్త మనోజ్‌ జరంగే (Manoj Jarange) చేపట్టిన నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరిన నేపథ్యంలో త్వరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరాఠా ప్రజల బలమైన ఆకాంక్షను పరిగణనలోకి తీసుకొని నా పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని గాడ్సే వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని