Supriya Sule: ఆ రెండు పార్టీల చీలిక వెనక.. భాజపా హస్తం: సుప్రియా

మరాఠీ ప్రజలు ప్రారంభించిన రెండు పార్టీలు చీలిపోవడం వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) నాయకురాలు సుప్రియా సూలే (Supriya Sule) ఆరోపించారు.

Published : 02 Oct 2023 02:03 IST

ముంబయి: మరాఠీ ప్రజలు ప్రారంభించిన రెండు పార్టీలు చీలిపోవడానికి భారతీయ జనతా పార్టీనే కారణమని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) నాయకురాలు సుప్రియా సూలే (Supriya Sule) విమర్శించారు. మహారాష్ట్రను బలహీన పరిచేందుకు ఉద్దేశపూర్వకంగానే కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి (Devendra Fadnavis) స్థాయిని భాజపా తగ్గించిందంటూ ఎద్దేవా చేశారు. గతేడాది శివసేన, కొన్ని నెలల క్రితం ఎన్‌సీపీలో చీలికలను ప్రస్తావిస్తూ సుప్రీయా సూలే ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మారాఠీ ప్రజల మద్దతు, ప్రేమాభిమానాలతో బాలాసాహెబ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌లు స్వయంగా రెండు రాజకీయ పార్టీలను స్థాపించారు. ఆ రెండు పార్టీల మూలాలు మహారాష్ట్రలోనే. వాటి బొడ్డుతాడు కూడా ఇక్కడి ప్రజలదే. కానీ, భాజపా మాత్రం ఆ రెండు పార్టీలను చీల్చింది’ అని సుప్రియా సూలే ఆరోపించారు. ఈ రెండింటిలోనూ దిల్లీ నుంచి అదృశ్య హస్తం పని చేసిందన్నారు. భాజపా కేంద్ర నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ సుప్రియా సూలే ఈ విధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలివెళ్తున్నాయని పేర్కొన్న ఆమె.. రాష్ట్రాన్ని బలహీనపరిచేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో తాను ఏ రాష్ట్రానికి వ్యతిరేకం కాదన్నారు.

మూడేళ్ల చిన్నారికి ‘పేరు’ పెట్టిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..!

శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ.. ఈ ఏడాది జులైలో రెండుగా చీలిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన అజిత్‌ పవార్‌.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి భాజపాలో చేరారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు.. గతేడాది జూన్‌లోనూ ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో శివసేనలో తిరుగుబాటు జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన శిందే.. మహావికాస్‌ అఘాడీని కూల్చి.. భాజపా సహాయంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని