Telangana News: తెలంగాణ ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ పాలన కోరుకుంటున్నారు: లక్ష్మణ్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని భాజపా నేత లక్ష్మణ్‌ విమర్శించారు.

Published : 15 Apr 2022 17:22 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని భాజపా నేత లక్ష్మణ్‌ విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. తెరాస వైఫల్యాలను ఎత్తి చూపుతూ, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించాలనే సంకల్పంతోనే బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. 31 రోజుల యాత్రలో రెండో రోజే కడుపు మంటతో తెరాస నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వేస్తే ఉరే.. అని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ ఇస్తున్నట్లు చెబుతోన్న రాష్ట్ర ప్రభుత్వం.. పంట చేతికొచ్చే సమయానికి రైతులకు కేవలం 7 గంటల విద్యుత్‌ మాత్రమే సరఫరా చేస్తుందన్నారు. వేగవంతమైన అభివృద్ధి, చిట్టచివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందేలా రాష్ట్ర ప్రజలు మోదీ తరహా డబుల్‌ ఇంజిన్‌ పాలనను కోరుకుంటున్నారని లక్ష్మణ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని