Rajyasabha Elections: ఒడిశా నుంచి అశ్వినీ వైష్ణవ్‌.. ఐదుగురితో భాజపా రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా

రాజ్యసభ ఎన్నికల కోసం భాజపా ఐదుగురు అభ్యర్థులతో రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది.

Published : 14 Feb 2024 12:37 IST

దిల్లీ: రాజ్యసభ ఎన్నికల (Rajyasabha Elections) కోసం భాజపా (BJP) ఐదుగురు అభ్యర్థులతో ·రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. ఒడిశా నుంచి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి మరో మంత్రి ఎల్‌. మురుగన్‌ బరిలో ఉంటారని తెలిపింది. ఈ దఫా ఎన్నికైతే వీరివురు రెండోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఒడిశాలో అశ్వినీ వైష్ణవ్‌కి అధికార బిజూ జనతాదళ్‌ (BJD) మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలకు పోటీ జరగనుంది. వీటిలో నాలుగు భాజపా, ఒకటి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మురుగన్‌తోపాటు ఉమేశ్‌ నాథ్‌ మహరాజ్‌, మాయ మరోలియా, బన్సీలాల్‌ గుర్జార్‌లను భాజపా అభ్యర్థులుగా ప్రకటించింది. రాజస్థాన్‌లో ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు మాజీ మంత్రి చున్నీలాల్‌ గరాసియా, మాజీ ఎమ్మెల్యే మదన్‌ రాథోడ్‌లు పోటీ చేస్తారని భాజపా తెలిపింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ల పదవీ కాలం ఏప్రిల్‌ 3తో ముగియనుంది.

గత ఆదివారం రాజ్యసభకు 14 మంది అభ్యర్థులతో భాజపా మొదటి విడత జాబితా విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ (7), బిహార్‌ (2), ఛత్తీస్‌గఢ్‌ (1), హరియాణా (1), కర్ణాటక(1), ఉత్తరాఖండ్‌ (1), పశ్చిమబెంగాల్‌ (1) రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థిత్వాలు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న రాజ్యసభ సభ్యుల్లో సుధాంశు త్రివేదికి మాత్రమే తిరిగి అవకాశం దక్కింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్‌.పి.ఎన్‌.సింగ్‌ పేరు కూడా జాబితాలో ఉంది. కొత్తవారికి పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. జాబితాలో లేని పలువురు కేంద్రమంత్రులు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయవచ్చని తెలుస్తోంది. 15 రాష్ట్రాల నుంచి ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని