BJP: భాజపా రెండో జాబితా.. బుధవారమేనా?: యడియూరప్ప కీలక వ్యాఖ్యలు

BJP: మరో రెండు రోజుల్లో భాజపా రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత యడియూరప్ప సూచనప్రాయంగా వెల్లడించారు.

Published : 04 Mar 2024 16:48 IST

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికలు (Loksabha Elections 2024) దగ్గరపడుతున్న వేళ అభ్యర్థుల ఎంపికలో భాజపా (BJP) దూకుడు పెంచింది. ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన కమలం పార్టీ.. రెండో విడతపై కసరత్తులు ముమ్మరం చేసింది. వచ్చే బుధవారం నాటికి అభ్యర్థుల రెండో జాబితా (Candidates List)ను ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, కర్ణాటక మాజీమంత్రి యడియూరప్ప (Yediyurappa) సోమవారం సూచనప్రాయంగా వెల్లడించారు.

‘‘బుధవారం రోజు దిల్లీలో భాజపా హైకమాండ్‌ నేతృత్వంలో సమావేశం జరగనుంది. దానికి నేను హాజరవుతున్నా. అందులో రెండో జాబితాను ఖరారు చేసే అవకాశాలున్నాయి. అందులో కర్ణాటక అభ్యర్థుల పేర్లూ ఉండొచ్చు. దానిపై చర్చించేందుకే నేను దిల్లీ వెళ్తున్నా. అభ్యర్థుల ఎంపికపై జాతీయ నేతలు తుది నిర్ణయం తీసుకుంటారు. బహుశా మరో రెండు రోజుల్లో జాబితాను ప్రకటించే అవకాశముంది’’ అని యడియూరప్ప తెలిపారు.

నన్ను క్షమించలేనని మోదీ అప్పుడే చెప్పారు.. టికెట్‌ దక్కకపోవడంపై ప్రజ్ఞా ఠాకుర్‌

కర్ణాటకలోని మొత్తం 28 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ‘ఇందులో ఆలస్యం ఉండకపోవచ్చు’ అని తెలిపారు. ఇక, లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటకలో ఎన్డీయే కూటమితో జేడీఎస్‌ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించనున్నారన్న విషయాన్ని మాత్రం యడియూరప్ప వెల్లడించలేదు. దీనిపై హైకమాండ్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

గత శనివారం సాయంత్రం దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భాజపా నేతలు తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 195 మందితో దాన్ని ప్రకటించారు. ముందుగా భావించినట్లే వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, గాంధీనగర్‌ నుంచి అమిత్‌ షా, లఖ్‌నవూ నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌లే బరిలోకి దిగుతున్నారు. ఇక, 33 స్థానాల్లో సిటింగ్‌లను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని