Samajwadi: మా భావజాలం అంతం కావాలనేదే కాంగ్రెస్‌ కోరిక..!: అఖిలేశ్‌ యాదవ్‌

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ‘సామ్యవాద సిద్ధాంతం’ అంతం కావాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని అఖిలేశ్‌యాదవ్‌ విమర్శించారు. 

Published : 08 Nov 2023 01:55 IST

భోపాల్‌: తమ పార్టీకి చెందిన సామ్యవాద భావజాలం (Socialist Ideology) అంతం కావాలని కాంగ్రెస్‌ (Congress) కోరుకుంటోందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) ఆరోపించారు. అయితే, ఈ భావజాలాన్ని తాము మరింత విస్తరిస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని నివాడీ జిల్లాలో అఖిలేశ్‌ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎస్పీలు కలిసి పోటీ చేయకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తమ భావజాలం వారికి భిన్నంగా ఉన్నందునే తాము రాజకీయాల్లో ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీలు రెండు విపక్ష కూటమి ‘ఇండియా (INDIA Bloc)’లో భాగమే. అయితే.. మధ్యప్రదేశ్‌ ఎన్నికల సీట్ల పంపకంపై రెండింటి మధ్య విభేదాలు వచ్చాయి. ప్రస్తుతం అక్కడ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి.

స్వరం మార్చిన అఖిలేశ్‌.. ‘ఇండియా’ కూటమిలోనే ఎస్పీ!

‘కొన్ని పరిస్థితుల వల్ల మేం కాంగ్రెస్‌తో కలిసి ఉన్నాం. కానీ.. సోషలిస్టుల అవసరం లేదని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అందుకే మేం దూరం జరిగాం. మేం సోషలిస్టులం. మా సొంత పార్టీని నాశనం చేసుకోలేం. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లారు. దీనికోసం రామ్‌ మనోహర్ లోహియా.. నెహ్రూకి వ్యతిరేకంగా పోరాడారు. సోషలిస్టు భావజాలాన్ని అంతం చేయనివ్వం. సమాజ్‌వాదీ సిద్ధాంతం అంతం కావాలని కాంగ్రెస్‌ కోరుకుంటోంది. అయితే.. ఈ భావజాలాన్ని మరింతగా వ్యాప్తి చేయడమే మా లక్ష్యం’ అని అఖిలేశ్‌ అన్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్, భాజపాలను మించిన మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో తమ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 17న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని