Sachin Pilot: హైదరాబాద్‌ ‘సీడబ్ల్యూసీ’ భేటీ ఎంతో కీలకం.. సీఎం ఎవరనేది అధిష్ఠానం చేతుల్లోనే..!

రానున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సీడబ్ల్యూసీ సమావేశం కీలకమని కాంగ్రెస్‌ రాజస్థాన్‌ నేత సచిన్‌ పైలట్‌ అన్నారు. ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

Published : 15 Sep 2023 17:26 IST

జైపుర్‌: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌ (Rajasthan) ఒకటి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ (Congress) పార్టీ.. మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల రోడ్‌మ్యాప్‌ ఖరారుకు, లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాద్‌ వేదికగా శనివారం నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రానున్న ఎన్నికల వ్యూహ రచనకు ఈ సమావేశాలు ఎంతో కీలకమని కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) పేర్కొన్నారు. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న పార్టీని తదుపరి ఎన్నికల్లో ఓడించే సంప్రదాయాన్ని తిరగరాస్తామని ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ కలిసికట్టుగా పనిచేస్తే రాజస్థాన్‌లో భాజపాను ఓడించగలమని సచిన్‌ పైలట్‌ అన్నారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలన్నింటినీ కాంగ్రెస్‌ నిలబెట్టుకున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఐకమత్యంగా పోరాడి, అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలనే దానిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. రాజస్థాన్‌లో భాజపా పూర్తిగా చతికిలపడిపోయిందని, పార్టీ అనేక సమస్యలను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఎన్నికల్లో విజయానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా.. సంప్రదాయంపైనే ఆశలు పెట్టుకుందని ఎద్దేవా చేశారు.

హస్తవాసి మార్చేలా!.. 16 నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు

ఇదిలా ఉండగా.. ఇటీవల పునర్వ్యవస్థీకరించిన సీడబ్ల్యూసీలో సచిన్‌ పైలట్‌ను కొత్తగా తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు రాష్ట్రంలో సీఎం అశోక్‌ గహ్లోత్‌తో కొనసాగిన వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు సచిన్‌ పైలట్‌ జులైలో ఓ ప్రకటన చేశారు. మరోవైపు.. సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా పార్టీకి చెందిన నలుగురు ముఖ్యమంత్రులతోపాటు అగ్రనాయకత్వమంతా 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోనే ఉండనుంది. ఇటీవలే సీడబ్ల్యూసీకి సభ్యులను, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులను నియమించగా.. ఈ కమిటీకి ఇదే తొలి సమావేశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని