Ashok Chavan: కాంగ్రెస్‌కు మరో షాక్‌.. పార్టీని వీడిన మాజీ సీఎం

మహారాష్ట్ర(Maharashtra)లో కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్(Ashok Chavan) కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.  

Updated : 12 Feb 2024 15:08 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. మహారాష్ట్ర(Maharashtra) మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్(Ashok Chavan) సోమవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల్లో ఆయన భాజపాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ దక్కనుందని సమాచారం.

ప్రస్తుతం చవాన్(Ashok Chavan).. భోకర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఆయన స్పీకర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సుమారు నెల రోజుల వ్యవధిలో మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్‌ను వీడిన రెండో కీలక నేత ఈయన. కొద్దిరోజుల క్రితం కేంద్ర మాజీమంత్రి మిలింద్ దేవ్‌రా (Milind Deora) హస్తం పార్టీ నుంచి బయటకు వెళ్లి, ఏక్‌నాథ్‌ శిందే శివసేనలో చేరారు. అలాగే 48 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగిన సీనియర్ నేత బాబా సిద్ధిక్.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.

బడ్జెట్‌ సమావేశాలు.. ప్రసంగించకుండానే వెళ్లిపోయిన గవర్నర్‌

మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో చవాన్‌(Ashok Chavan) కుటుంబానికి పట్టు ఉంది. ప్రస్తుత పరిణామం రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేతో ఉన్న విభేదాలు ఆయన రాజీనామాకు దారితీసి ఉండొచ్చని వార్తా కథనాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని