Tamil Nadu: బడ్జెట్‌ సమావేశాలు.. ప్రసంగించకుండానే వెళ్లిపోయిన గవర్నర్‌

Tamil Nadu Governor vs CM: తమిళనాడు ప్రభుత్వంపై కొంతకాలంగా అసహనంగా ఉన్న ఆ రాష్ట్ర గవర్నర్‌.. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు నిరాకరించారు. సభకు వచ్చి నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయారు.

Updated : 12 Feb 2024 12:22 IST

చెన్నై: తమిళనాడు (Tamil Nadu)లో అధికార డీఎంకే సర్కారు, గవర్నర్‌ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు (Budget Session) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభకు వచ్చిన గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి (Governor RN Ravi).. ప్రారంభ ప్రసంగం చేసేందుకు నిరాకరించారు. జాతీయ గీతాన్ని ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపిస్తూ.. నిమిషాల వ్యవధిలోనే సభ నుంచి వెళ్లిపోయారు.

‘‘గవర్నర్‌ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయ గీతం ఆలపించాలని నేను పదే పదే చేసిన అభ్యర్థనలను విస్మరించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో చెప్పిన చాలా అంశాలను నైతిక కారణాలతో నేను అంగీకరించలేదు. వాటి విషయంలో విభేదించే నేను.. ప్రసంగంలో వాటిని పేర్కొంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. అందుకే ఈ ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను’’ అంటూ గవర్నర్‌ సభను వీడారు.

పదేళ్లలో అద్భుత ప్రగతి : గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

కాగా.. గతేడాది కూడా ప్రసంగం విషయంలో గవర్నర్‌ ఇలాగే వ్యవహరించారు. బడ్జెట్‌ సమావేశంలో ప్రభుత్వం సిద్ధం చేసి ఆమోదం పొందిన ప్రసంగంలోని కొన్ని భాగాలు మినహాయించి, కొన్ని వాక్యాలు అదనంగా చేర్చి గవర్నర్‌ ప్రసంగించడం తీవ్ర దుమారం రేపింది. గవర్నర్‌ సొంతంగా చేర్చిన వ్యాఖ్యలను సభా రికార్డులో చేర్చకూడదని, ప్రభుత్వం సిద్ధం చేసిన గవర్నర్‌ ప్రసంగాన్ని మాత్రమే యథాతథంగా రికార్డులో నమోదు చేయాలంటూ స్టాలిన్‌ తీసుకొచ్చిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ వ్యవహారం గవర్నర్‌, స్టాలిన్‌ సర్కార్‌ మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. తాజాగా మరోసారి ఆయన ప్రసంగించేందుకు నిరాకరించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ కూడా బడ్జెట్‌ సమావేశాల్లో తన ప్రసంగాన్ని రెండు నిమిషాల్లోపే ముగించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా విజయన్‌ సర్కారుపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. ప్రభుత్వం ఇచ్చిన 62 పేజీల ప్రసంగాన్ని చదివేందుకు ఇష్టపడలేదు. కేవలం 84 సెకన్లలో చివరి పేరాను చదివి సభ నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని