BRS: భారాసను మళ్లీ తెరాసగా మార్చండి!

భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)ని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)గా మార్చాలని ఆ పార్టీ శ్రేణులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 11 Jan 2024 09:36 IST

సమీక్షల్లో పార్టీ శ్రేణుల వినతి
తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావించిన కడియం!

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)ని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)గా మార్చాలని ఆ పార్టీ శ్రేణులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా నిర్వహిస్తున్న లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి విశ్లేషణలను కొనసాగిస్తూనే.. మరోవైపు ఎక్కువమంది పార్టీ నాయకులు భారాసను తెరాసగా తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలని విన్నవిస్తున్నట్లు తెలిసింది. తాజాగా బుధవారం వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలోనూ భారాస సీనియర్‌ నేత కడియం శ్రీహరి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమక్షంలో దీనికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ‘‘తెలంగాణ పార్టీగా ప్రజల్లో మనకు బలమైన గుర్తింపు ఉంది. పార్టీ పేరులో ‘తెలంగాణ’ను తొలగించి, ‘భారత్‌’ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోంది. భారాస తమది కాదనే భావన ప్రజల్లో ఏర్పడుతోంది.

కనీసం 1-2 శాతం ప్రజల్లో ఆ భావన ఏర్పడినా.. మన పార్టీకి ఆ మేరకు ఓట్లు దూరమయ్యాయనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. భారాసగా మారిన తర్వాత అంతగా కలిసిరాలేదనే భావన కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు  ఎక్కువమంది కార్యకర్తలు, ప్రజలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పార్టీకి వరమైన తెలంగాణ సెంటిమెంటును దూరం చేసుకోవద్దు. తిరిగి తెరాసగా మారిస్తే బాగుంటుంది. ఇది మెజారిటీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం. ఒకవేళ జాతీయస్థాయి రాజకీయాల్లో ‘భారాస’ ఉండాలనుకుంటే.. దాన్ని అలాగే ఉంచి.. రాష్ట్ర రాజకీయాలకు ‘తెరాస’ను తెర మీదకు తీసుకొచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇందులో న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే మాజీ  ఎంపీ వినోద్‌కుమార్‌ వంటివారు ఈ విషయంలో సంబంధిత నిపుణులతో చర్చిస్తే బాగుంటుంది. అధినేత కేసీఆర్‌ దృష్టికి కూడా ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకెళ్లాలి’’ అని కడియం శ్రీహరి ప్రతిపాదించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని