Chandrababu: మోదీ అధ్యక్షతన సమావేశం.. చంద్రబాబుకు ఆహ్వానం

తెదేపా అధినేత చంద్రబాబు డిసెంబర్‌ 5న దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

Updated : 23 Nov 2022 18:15 IST

దిల్లీ: జీ-20 దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తున్న భారత్‌.. వచ్చే ఏడాది ఈ సదస్సు నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సదస్సు ఏర్పాటుపై దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌ 5న సమావేశం కానున్నారు. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానం పంపింది. ఇందులో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కూడా డిసెంబర్‌ 5న దిల్లీ వెళ్లనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. మన దేశంలో నిర్వహించే జీ-20 సదస్సుపై ప్రధానంగా చర్చించనున్నారు. దీని ద్వారా రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోనుంది. డిసెంబర్‌ 5న సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇందుకోసం అన్ని పార్టీల అధ్యక్షులకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, సహాయ మంత్రులు అర్జున్‌రాం మేఘ్వాల్‌, మురళీధరన్‌లు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి ఈ భేటీ ముఖ్య ఉద్దేశం, అజెండాను వివరించారు. కాంగ్రెస్‌, బీఎస్పీ, తెరాస, తెదేపా సహా 15 పార్టీల అధ్యక్షులతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఫోన్‌లో మాట్లాడగా.. వామపక్ష పార్టీలు సహా మరికొన్ని పార్టీల ప్రధాన నేతలతో అర్జున్‌రాం మేఘ్వాల్‌, మురళీధరన్‌లు మాట్లాడి కార్యక్రమ అజెండాను వివరించారు. ఇటీవల ఇండోనేసియా బాలిలో జరిగిన కార్యక్రమంలో సదస్సు అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ స్వీకరించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని