Arvind Kejriwal: గుజరాత్‌ ఎయిర్‌పోర్టులో కేజ్రీవాల్‌కు చేదు అనుభవం..

మరికొద్ది నెలల్లో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

Published : 21 Sep 2022 02:02 IST

వడోదర: మరికొద్ది నెలల్లో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఆయన వడోదర ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్‌ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే కొందరు ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ భాజపా, కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు.

‘‘వడోదర ఎయిర్‌పోర్టుకు నేను చేరుకోగా.. కొందరు నా ముందు ‘మోదీ.. మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు. రాహుల్‌ గాంధీ గుజరాత్‌లో పర్యటిస్తే ఆయనకు వ్యతిరేకంగా భాజపా ఎన్నడూ ఇలా నినాదాలు చేయలేదు. నన్ను, ఆమ్‌ ఆద్మీ పార్టీని వేధించేందుకు భాజపా, కాంగ్రెస్‌ ఏకమై ఇలాంటి కుట్రలు చేస్తున్నాయి. గుజరాత్‌లో భాజపాకు మా నుంచి పెను సవాల్‌ ఎదురవనుంది. గతంలో పట్టణ ప్రాంతాల్లోని 66 సీట్లలో కాషాయ పార్టీ ఎన్నడూ ఓడిపోలేదు. కానీ, రాబోయే ఎన్నికల్లో ఆ సీట్లను వారు సొంతం చేసుకోలేరు’’ అని కేజ్రీవాల్‌ దుయ్యబట్టారు.

వడోదర పర్యటనలో భాగంగా ఆయన పలు వర్గాల ప్రజలతో ఆయన టౌన్ హాల్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుజరాత్‌ ప్రజలకు కేజ్రీవాల్‌ హామీలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ పాత పింఛను విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని