Kishan Reddy: ఖర్గే.. మీ మధ్య దోస్తీ లేకపోతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: కిషన్‌రెడ్డి

చేవెళ్ల ప్రజాగర్జన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పచ్చి అబద్ధాలు మాట్లాడారని కేంద్రమంత్రి, భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు భాజపాతో అంతర్గత స్నేహం కుదిరిందని, అందుకే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేశారన్న ఖర్గే వ్యాఖ్యలపై కిషన్‌ మండిపడ్డారు.  

Updated : 27 Aug 2023 14:26 IST

హైదరాబాద్: చేవెళ్ల ప్రజాగర్జన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పచ్చి అబద్ధాలు మాట్లాడారని కేంద్రమంత్రి, భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు భాజపాతో అంతర్గత స్నేహం కుదిరిందని, అందుకే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేశారన్న ఖర్గే వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌, భారాస రెండూ ఒకటే. ఈ రెండు పార్టీల మధ్య మతతత్వ మజ్లిస్‌ దోస్తీ కుదుర్చుతోంది. కాంగ్రెస్‌, భారాసకు మధ్య దోస్తీ లేదనే విషయాన్ని నిరూపించాలనుకుంటే తాను వేసే ఈ ప్రశ్నలకు ఖర్గే సమాధానం చెప్పి.. భాజపాకు క్షమాపణలు చెప్పాలి’’ అని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

భాజపాతో కేసీఆర్‌ దోస్తీ

కిషన్‌రెడ్డి సంధించిన ప్రశ్నలివీ..

  • పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి భూమి లేదని బుకాయిస్తున్న భారాస ప్రభుత్వం.. కాంగ్రెస్‌కు మాత్రం హైదరాబాద్ నడిబొడ్డున 10 ఎకరాల విలువైన భూమిని కట్టబెట్టింది వాస్తవం కాదా? 
  • తెలంగాణలో హస్తం గుర్తు మీద గెలిచిన చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే భారాస ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మీ ఎమ్మెల్యేల మీద మీరు చర్యలు తీసుకోకపోవడం మీ రెండు పార్టీల మధ్య ఉన్న సత్సంబంధాలకు నిదర్శనం కాదా?
  • రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి భారాస మద్దతు తెలపడంతోపాటుగా.. ఆ ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రంలో కేసీఆర్ ముందుండి నడపడం మీ మధ్య ఉన్న దోస్తీకి ఉదాహరణ కాదా?
  • శాసనమండలిలో కాంగ్రెస్‌ను పూర్తిగా భారాసలో విలీనం చేసినపుడు స్పందించకపోవడం మీ మధ్య దోస్తీకి పరాకాష్ఠ కాదా?
  • ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నది నిజం కాదా? భారాస మద్దతులేకుండా యూసీసీని వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పగలదా?
  • లోక్‌సభ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి భారాస, కాంగ్రెస్ రెండూ కలిసి అనుకూలంగా ఓటు వేసిన విషయం వాస్తవం కాదా?
  • కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పని చేశారు. అప్పటినుంచే మీ స్నేహం కొనసాగుతున్నది నిజం కాదా?

భాజపాను ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు ఎంతకైనా తెగిస్తారని కిషన్‌ విమర్శించారు. అవసరమైతే తమ ఓటును పూర్తిగా భారాసకు బదిలీ చేయడం ద్వారా తెలంగాణలో భాజపా ప్రభంజనాన్ని అడ్డుకోవాలనేది కాంగ్రెస్‌ ఆలోచన అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని