ఆ విషయంలో ప్రధాని మోదీ.. చిరుత కంటే వేగం: ఒవైసీ

ముఖ్యమైన సమస్యల విషయానికి వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకోవడంలో ప్రధాని మోదీ చీతా కంటే వేగంగా ఉంటారని మజ్లిస్‌ అధినేత ఒవైసీ అన్నారు.

Published : 15 Sep 2022 01:56 IST

జైపుర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అత్యంత ముఖ్యమైన సమస్యల విషయానికి వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకోవడంలో ప్రధాని మోదీ చిరుత కంటే వేగంగా ఉంటారన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజస్థాన్‌కు చేరుకున్న ఒవైసీ.. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై విలేకరులతో ముచ్చటించారు.

‘దేశంలో పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలు ప్రస్తావించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చిరుత కన్నా వేగంగా తప్పించుకుంటారు’ అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. భారత్‌లో అంతరించిపోతున్న చిరుతలను తిరిగి వృద్ధి చేసేందుకు చేస్తోన్న కార్యక్రమంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఒవైసీ ఈ విధంగా స్పందించిన ఆయన.. ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోదీ చాలా తెలివిగా బయటపడతారని అన్నారు. 

భారత్‌లో అంతరించిపోతున్న చిరుతలను (Cheetah) తిరిగి వృద్ధి చేసే లక్ష్యంతో.. వాటి దిగుమతికి సంబంధించి భారత ప్రభుత్వం నమీబియాతో గతంలో ఓ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ అభయారణ్యానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 17కల్లా కునో పార్కుకు ఇవి చేరుకోనున్నాయి. అదే రోజున ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ‘చిరుతల పునఃపరిచయ కార్యక్రమాన్ని’ మోదీతో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు మజ్లిస్‌ అధినేత పైవిధంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని