Chandrababu: ఓటమి ఖాయమని తెలిసే జగన్‌ మాటల్లో తేడా వచ్చింది: చంద్రబాబు

ప్రజలను చైతన్యపరిచి.. రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికే ఉరవకొండకు వచ్చినట్లు తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 27 Jan 2024 18:29 IST

ఉరవకొండ: ప్రజలను చైతన్యపరిచి.. రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికే ఉరవకొండకు వచ్చినట్లు తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇక్కడ తెదేపా-జనసేన గాలి వీస్తోందని, ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తే సీఎం జగన్‌కు నిద్ర పట్టదని వ్యాఖ్యానించారు.  ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 సీట్లలో తెదేపా-జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉరవకొండలో నిర్వహించిన రా.. కదలిరా.. బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘‘ఓటమి ఖాయమని తెలిసే జగన్‌ మాటల్లో తేడా వచ్చింది. హ్యాపీగా దిగిపోతా అని ఇప్పుడు అంటున్నారు. రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉంది. వైకాపా పాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటీ లేదు. రాష్ట్రం ఒక్కసారిగా 30 ఏళ్లు వెనక్కి పోయింది. అనంతపురం జిల్లాకు నీరు ఇస్తే బంగారం పండిస్తారు. ఈ జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనేది నా లక్ష్యం. రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవా, కాలువల విస్తరణ పనులు చేశాం. గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకురావాలని అనుకున్నాం. 90 శాతం రాయితీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందించాం.

ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఎవరిని మోసం చేస్తారు?

ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు యువత సిద్ధమైంది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా మేం చేస్తే.. ఈ ప్రభుత్వం మాత్రం ఫిష్‌ మార్ట్‌, మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పరిశ్రమలను తరిమేశారు. పరిశ్రమలు వచ్చి ఉంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. కమీషన్లు ఇవ్వలేక అనేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. మీరు పది అడుగులు ముందుకు వేయండి.. నేను వంద అడుగులు వేస్తా. 2047 నాటికి తెలుగుజాతి నంబర్‌ వన్‌ కావాలి. యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తాం’’ అని ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని