Uddhav Thackeray: ‘శివసేన’పై స్పీకర్‌ నిర్ణయం.. మళ్లీ సుప్రీంకు ఉద్ధవ్‌ ఠాక్రే

Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్‌ ఇచ్చిన నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Published : 16 Jan 2024 02:35 IST

ముంబయి: శివసేన (Shiv Sena)లో రెండు చీలిక వర్గాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న పోరు ఇప్పుడప్పుడే ముగిసేలా కన్పించట్లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ఇటీవల ఆదేశాలు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. తమ అనర్హత అభ్యర్థనను కొట్టివేస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. ఠాక్రే వర్గం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

శివసేన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఉద్ధవ్‌, ఏక్‌నాథ్‌ శిందే వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్‌ ఇటీవల తన నిర్ణయాన్ని ప్రకటించారు. శిందే వెంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతూ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ సభాపతి తిరస్కరించారు. శివసేన మొత్తం ఎమ్మెల్యేలు 57మంది కాగా వారిలో అత్యధికులు(37 మంది) శిందే వెంటే ఉన్నారని స్పీకర్‌ నిర్ధారించారు.

అధిష్ఠానంపై తిరుగుబావుటా

ఇదీ నేపథ్యం..

2022 జూన్‌లో ఏక్‌నాథ్‌ శిందే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేయడంతో శివసేనలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. భాజపాతో కలిసి శిందే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో  పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం వైరి వర్గంలోని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ శివసేనలోని రెండు వర్గాలు సభాపతికి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ పిటిషన్లపై 2024 జనవరి 10లోగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సభాపతి తన నిర్ణయాన్ని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని