5G In America:భారత్‌-అమెరికా మధ్యఎయిరిండియా సర్వీసుల పునరుద్ధరణ

5జీ అంతర్జాల సేవల కారణంగా విమాన సేవలకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో భారత్‌-అమెరికా

Published : 21 Jan 2022 10:05 IST

బోయింగ్‌ 777 విమానాలకు 5జీ సేవలతో ముప్పు లేదన్న ఎఫ్‌ఏఏ 

దిల్లీ, దుబాయ్‌: 5జీ అంతర్జాల సేవల కారణంగా విమాన సేవలకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో భారత్‌-అమెరికా మధ్య రద్దయిన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య శుక్రవారం నుంచి అన్ని సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ‘5జీ’ ఆందోళనలతో బుధవారం రద్దు చేసిన 8 సర్వీసుల్లో ఆరింటిని (బోయింగ్‌ 777 విమానాలు) గురువారమే తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. బోయింగ్‌ సంస్థ నుంచి అందుకు అవసరమైన అనుమతులు వచ్చినట్లు పేర్కొంది. 5జీ అంతర్జాల సేవల కారణంగా విమానాల్లోని రేడియో అల్టీమీటర్లు ప్రభావితమవుతాయని.. ఫలితంగా ఇంజిన్, బ్రేకింగ్‌ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆందోళనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ- ‘ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)’ గురువారం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బోయింగ్‌ 777 రకం సహా కొన్ని విమానాల అల్టీమీటర్లపై ‘5జీ’ ప్రభావం ఉండబోదని సష్టం చేసింది. వెంటనే- ఆ తరగతి విమానాలను అమెరికాకు నడిపేందుకు వీలుగా ఎయిరిండియాకు బోయింగ్‌ పచ్చజెండా ఊపింది. మరోవైపు- బ్రిటిష్‌ ఎయిర్‌వేస్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా అమెరికాకు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించాయి. 

‘భారత్‌లో ఇబ్బంది ఉండదు’ 

ప్రతిపాదిత 5జీ సేవలతో భారత్‌లో విమాన సర్వీసులకు ఎలాంటి ముప్పూ ఉండబోదని ‘ఇంటర్నేషనల్‌ టెలీకమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) - ఆసియా పసిఫిక్‌ టెలీకమ్యూనిటీ (ఏపీటీ) ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ గురువారం స్పష్టం చేసింది. దేశంలో ‘5జీ’ కోసం 3300-3670 మెగాహెర్ట్జ్‌ల ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా విమానాలు మాత్రం రేడియో అల్టీమీటర్ల కోసం 4200-4400 మెగాహెర్ట్జ్‌ల ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకుంటాయని వెల్లడించింది. అమెరికాలో ‘5జీ’కి వినియోగించే బ్యాండ్‌ (3700-3980 మెగాహెర్ట్జ్‌).. అల్టీమీటర్ల ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉండటం వల్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు పేర్కొంది. 

అమెరికాలో 5జీ సేవలు షురూ 

అగ్రరాజ్యం అమెరికాలో 5జీ అంతర్జాల సేవలను ఏటీ అండ్‌ టీ, వెరిజాన్‌ టెలికాం సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. విమానయాన సంస్థల అభ్యంతరాల నేపథ్యంలో.. కొన్ని విమానాశ్రయాల చుట్టూ మాత్రం ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని