Published : 12 Jun 2021 01:44 IST

Cricket News:‘నన్ను ఆ కారణంతోనే ఎంపిక చేయలేదా’

(photo:Saurashtra Cricket Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: జులైలో టీమ్‌ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ గురువారం జట్టును ప్రకటించింది. సీనియర్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో శిఖర్‌ ధావన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. 20మంది ఆటగాళ్లతో పాటు ఐదుగురు నెట్‌ బౌలర్లను ఎంపిక చేసింది. ఈ బృందంలో చాలా మంది యువ క్రికెటర్లకు అవకాశం దక్కింది. అందులో దేవదత్‌ పడిక్కల్, రుతురాజ్‌ గైక్వాడ్‌, కృష్ణప్ప గౌతమ్‌, నితీశ్ రాణా, చేతన్‌ సకారియా వంటి ఆటగాళ్లు మొదటిసారి టీమ్‌ఇండియాకు ఎంపికయ్యారు. ఈ పర్యటనలో తనకు కూడా చోటు దక్కుతుందని భావించిన సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ షెల్డన్‌ జాక్సన్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ ఆటగాడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. తాను ఎంపికకాకపోవడంపై జాక్సన్‌ స్పందించాడు.

‘ఇప్పుడు నాకు 34 ఏళ్లు. అయినప్పటికీ 22-23 ఏళ్ల వారికంటే దూకుడుగా ఆడతాను. ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేనేం చేయలేను. లేటు వయసులో జాతీయజట్టులోకి ఎంట్రీ లేదని ఆటకు సంబంధించిన ఏ చట్టాల్లో రాసి ఉంది?  మీరు(సెలక్టర్లు) ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తున్నారు. రంజీ స్కోరుతోనా.. ఫిట్‌నెట్‌ను ఆధారంగా చేసుకోనా?. వరుసగా మూడు రంజీ సీజన్లలో 800-900 పరుగులు చేశానంటే ఫిట్‌గా ఉన్నాననే కదా అర్థం. అతని వయసు 30 కంటే ఎక్కువ.. అందుకే ఎంపిక కాలేదు. ఈ పదం చాలా సార్లు విన్నా’ అంటూ జాక్సన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ‘సూర్యుడు ఉదయిస్తాడు, నేను మళ్లీ ప్రయత్నిస్తా’ అంటూ ట్విటర్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోని పోస్టు చేశాడు.

జాక్సన్‌ 75 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5634 పరుగులు, 60 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 2096 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు,44 అర్ధసెంచరీలున్నాయి. జాక్సన్‌ వికెట్‌కీపర్‌ కూడా. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున 4 మ్యాచ్‌ల్లో ఆడాడు. ఐపీఎల్ 14 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts