1983:కలసికట్టుగా విరుచుకుపడ్డ కపిల్‌ డెవిల్స్‌..!

భారత క్రికెట్‌ చరిత్రను మలుపుతిప్పిన ఘనత 1983 ప్రుడెన్షియల్‌ కప్‌ విజయానికే దక్కుతుంది. అసలు ఈ టోర్నీతోనే భారత్‌లో స్టార్‌ ఆటగాళ్లు పుట్టుకొచ్చారు.

Published : 23 Dec 2021 01:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత క్రికెట్‌ చరిత్రను మలుపుతిప్పిన ఘనత 1983 ప్రుడెన్షియల్‌ కప్‌ విజయానికే దక్కుతుంది. అసలు ఈ టోర్నీతోనే భారత్‌లో స్టార్‌ ఆటగాళ్లు పుట్టుకొచ్చారు. ఇప్పట్లా 50 ఓవర్ల ఇన్నింగ్స్‌లు కాదు.. అప్పట్లో 60 ఓవర్ల ఇన్నింగ్సులు ఉండేవి. వాస్తవానికి ఈ టోర్నీలో భారత్‌ అండర్‌డాగ్‌గా బరిలోకి దిగింది. ఈ టోర్నీ నాటికి కపిల్‌ వయస్సు 24 ఏళ్లు. కప్‌ గెలవదులే అని టీమ్‌ ఇండియా సభ్యులు ముందే నిర్ణయించుకొని కొందరు సభ్యులు న్యూయార్క్‌లో ఛారిటీ మ్యాచ్‌లు ఆడేందుకు ఒప్పందాలు చేసుకొన్నారు. తీరా విజయాల పరంపర మొదలవ్వగానే ఆ కాంట్రాక్టును రద్దు చేసుకోవడం విశేషం.  నేడు అత్యంత సంపన్న బోర్డుగా ఉన్న బీసీసీఐ వద్ద 1983లో ప్రపంచ కప్‌ విజేతలకు నజరానాలు ఇచ్చేందుకు సరైన నిధులు కూడా లేవు. దీంతో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌తో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా వచ్చిన నిధులతో ఒక్కో ఆటగాడికి దాదాపు లక్షరూపాయల నజరానా ఇచ్చారు. 83 జట్టులోని పలువురు ఆటగాళ్లు  ఆ తర్వాత భారత జట్టుకు కోచ్‌లుగా, సెలక్టర్లుగా బాధ్యతలు కూడా నిర్వహించారు. ఈ విజయం ఆధారంగా నిర్మించిన 83 చిత్రం తాజాగా విడుదల కానున్న నేపథ్యంలో ..   

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లు ఆడిన కపిల్‌ దేవ్‌..!

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ జీఎం టర్నర్‌(171*) పేరిట ఉన్న అత్యధిక స్కోర్‌ రికార్డును ఈ టోర్నిలో భారత ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌(175*) అలవోకగా బద్దలు కొట్టాడు. వాస్తవానికి బీబీసీ సిబ్బంది సమ్మెలో ఉండటంతో జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌ను రికార్డు చేయలేకపోయారు. కొన్ని ఫొటోలు మాత్రం ఉన్నాయి.  ఈ టోర్నీలో 303 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచారు.  ఈ హరియాణా హరికేన్‌ బౌలింగ్‌తో కూడా టోర్నీలో సంచలనం సృష్టించారు. భారత్‌ తరపున తొలిసారి 5 వికెట్లు తీసుకొన్న బౌలర్‌ (ఆసీస్‌పై 5/43)గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైంది. 1988 వరకు మరో భారత బౌలర్‌(కె.శ్రీకాంత్‌)కు ఈ ఫీట్‌ సాధించడం సాధ్యం కాలేదు. ఫీల్డింగ్‌లోనూ కపిల్‌ మెరుపులు కొనసాగాయి. భారత్‌ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 7 క్యాచ్‌లు అందుకొన్నాడు. 83 వరల్డ్‌ కప్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకొన్న ఫీల్డర్‌ కపిల్‌ దేవ్‌ కావడం మరో విశేషం..! తాజాగా నిర్మించిన ‘83’ చిత్రంలో కపిల్‌ పాత్రను రణ్‌వీర్‌సింగ్‌ పోషించారు. 


బ్యాటింగ్‌ ఆర్డర్‌ను నిర్ణయించిన అమర్‌నాథ్‌..

అప్పట్లో భారత జట్టుకి అధికారికంగా కోచ్‌ అంటూ ఎవరూ లేరు. ఆ బాధ్యతలను సీనియర్లలో ఒకరైన మొహిందర్‌ అమర్‌నాథ్‌ నిర్వహించారు. ఆయనకు సహాయంగా కపిల్‌, సునీల్‌ గావాస్కర్‌ వ్యవహరించారు.  బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఆర్డర్‌ను అమర్‌నాథే నిర్ణయించారు. ఫైనల్స్‌లో 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.  ఈ టోర్నీ సెమీ ఫైనల్‌, ఫైనల్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులు ఆయనకే దక్కాయి.  నాటి టీమ్‌కు డాక్టర్‌, ఫిజియోథెరపిస్టు కూడా లేకపోవడం గమనార్హం. తాజా చిత్రంలో ఈ పాత్రను షకీబ్‌ సలీమ్‌ పోషిస్తున్నారు.


ఫైనల్‌లో అత్యధిక స్కోర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌దే..!

వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కృష్ణమాచారి శ్రీకాంత్‌ (38) నిలిచారు. ఇరు జట్లలో చూసినా ఆయనదే అత్యధిక స్కోరు. ఆ మ్యాచ్‌లో భారత్‌ కేవలం 183 పరుగులే చేసింది. కానీ, ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంత తక్కువ స్కోర్‌ చేసి గెలిచిన జట్టుగా టీమ్‌ ఇండియా రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. శ్రీకాంత్‌గా నటుడు జీవా కనిపించనున్నారు.


అత్యధిక వికెట్లతో రోజర్‌ బిన్ని..!

 ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రోజర్‌ బిన్ని నిలిచారు. మొత్తం 18 వికెట్లు ఆయన ఖాతాలో పడ్డాయి. ఒక ప్రపంచ కప్‌లో తొలిసారి ఈ ఘనత సాధించిన భారతీయుడిగా నిలిచారు. ఆయన తర్వాత కుంబ్లే(1996), జహీర్‌ ఖాన్‌ (2011) మాత్రం ఈ ఘనతను అందుకొన్నారు. రోజర్‌ బిన్నీగా నిషాంత్‌ దహియా సందడి చేయనున్నారు.


ఫైనల్లో రిచర్డ్స్‌ను ఔట్‌ చేసిన మదన్‌ లాల్‌

 ఈ టోర్నీలో మదన్‌లాల్‌ భారత్‌కు కీలక సమయాల్లో వికెట్లను అందించారు. ఫైనల్‌ మ్యాచ్‌లో వెస్టిండిస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ వివియన్‌ రిచర్డ్స్‌ను ఆయనే ఔట్‌ చేశారు. టోర్నీ మొత్తంలో 17 వికెట్లు తీసి రోజర్‌ బిన్ని తర్వాతి స్థానంలో నిలిచారు. ఫైనల్‌లో కపిల్‌ నుంచి పట్టుబట్టి మరీ బంతిని లాక్కొన్న మదన్‌.. రిచర్డ్స్‌ వికెట్‌ తీసి విండీస్‌ నడ్డివిరిచారు. రిచర్డ్స్‌ క్యాచ్‌ను కపిల్‌ అద్భుతంగా అందుకొన్నారు.  ఈ మ్యాచ్‌లో మదన్‌లాల్‌కు మూడు వికెట్లు దక్కాయి. మదన్‌లాల్‌గా హర్దీ సంధు కనిపించనున్నారు.


సెమీస్‌లో రాణించిన ఆజాద్‌..!

1983 ప్రపంచకప్‌ టీమ్‌ ఎంపికల్లో వివాదాస్పదమైంది కీర్తి ఆజాద్‌ ఎంపిక. ఆయన తండ్రి భగవత్‌ ఝా ఆజాద్‌ అప్పటికే కేంద్ర మంత్రిగా, బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా ప్రభావంతమైన రాజకీయ నాయకుడు. 1981, 82 అంతర్జాతీయ మ్యాచ్‌ల సీజన్లలో అంతంతమాత్రంగానే రాణించిన ఆజాద్‌ను ప్రపంచ కప్‌కు ఎంపిక చేయడం వివాదాస్పదగా మారింది. అప్పట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరున్న రాజేంద్ర జడేజాకు ఆ స్థానం వెళ్లాల్సి ఉందనే విమర్శలున్నాయి. ఏది ఏమైనా..  ఈ ప్రపంచ కప్‌లో ఆజాద్‌ సెమీఫైనల్‌లో రాణించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై  12-1-28-1 (ఇయాన్‌ బోధం వికెట్‌)తో పొదుపుగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇయాన్‌ బోధం వికెట్‌ తీసినందుకు ప్రేక్షకులు తనకు 250 పౌండ్లు వరకు ఇచ్చారని ఆజాద్‌ ఓ సందర్భంలో వెల్లడించారు.  కీర్తి ఆజాద్‌ పాత్రలో దినకర్‌ శర్మ నటిస్తున్నారు.


ఆ డబ్బు ముట్టని సునీల్‌ గావాస్కర్‌‌..!

1983 ప్రపంచ కప్‌కు కొన్నాళ్ల ముందే భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావాస్కర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి కపిల్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించారు. 1983లో ఓపెనర్‌ బాధ్యతలు స్వీకరించిన గావాస్కర్‌ పెద్దగా రాణించలేదు. ఆరు మ్యాచుల్లో బ్యాటింగ్‌ చేసిన ఆయన కేవలం 59 పరుగులు మాత్రమే చేశారు. రెండు మ్యాచుల్లో గావస్కర్‌ను పక్కనపెట్టారు. మొహిందర్‌ అమర్‌నాథ్‌తో కలిసి ఆయన కోచింగ్‌ బాధ్యతలను పంచుకోవడం విశేషం. అప్పట్లో క్రీడాకారులకు ప్రతి మ్యాచ్‌కు రూ.12,500 చెల్లించేవారు. ఈ టోర్నీలో విజయం తర్వాత బీసీసీఐ జట్టు మొత్తానికి రూ.2లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. గావాస్కర్‌ ఆ మొత్తం స్వీకరించేందుకు నిరాకరించారు. సునీల్‌ గావస్కర్‌గా తాహిర్‌ రాజ్‌ బాసిన్‌ నటిస్తున్నారు.


కిర్మానీ కీపింగ్‌ అదుర్స్‌..!

1983 వరల్డ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ కిర్మానీ ఒకరు. ఈ టోర్నీలో ఉత్తమ వికెట్‌ కీపర్‌గా నిలిచారు. ఫైనల్‌లో వెస్టిండీస్‌ ఆటగాడు ఫౌద్‌ బచ్చేస్‌ అందించిన కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. జూన్‌ 11న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు అందుకొన్నాడు. అంతేకాదు జూన్‌ 18వ తేదీన జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో లోయర్‌ ఆర్డర్‌లో భారత బ్యాటింగ్‌కు అండగా నిలిచి  చరిత్రాత్మక విజయంలో భాగస్వామి అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కపిల్‌ (175*)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. స్ట్రైక్‌ను వేగంగా రొటేట్‌ చేస్తూ కపిల్‌ ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేసేట్లు చూశాడు. ఈ భాగస్వామ్యంలో కిర్మానీ అజేయంగా చేసినవి కేవలం 24 పరుగులు మాత్రమే. కానీ, వికెట్‌ పడనీయలేదు. టోర్నీ మొత్తంలో 14 వికెట్లు పడగొట్టడంలో కిర్మానీ పాత్ర ఉంది. సయ్యద్‌ కిర్మానీగా సాహిల్‌ ఖట్టర్‌ కనపడనున్నారు.


నిలకడగా రాణించిన సందీప్‌ పాటిల్‌..!

టోర్నీ మొత్తంలో భారత్‌ తరపున మిడిల్‌ ఆర్డర్‌లో అత్యంత నిలకడగా రాణించిన బ్యాట్స్‌మన్‌గా సందీప్‌ పాటిల్‌ నిలిచారు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 216 పరుగులు చేశారు. కేవలం రెండు సార్లు మాత్రమే సింగల్‌ డిజిట్‌ వద్ద వికెట్‌ పోగొట్టుకొన్నారు. ఈ మొత్తం స్కోర్లలో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి సెమీస్‌లో(51) చేశారు. ఫైనల్‌లో భారత్‌ జట్టు తరపున రెండో అత్యుత్తమ స్కోర్‌ (27) పాటిల్‌దే. అప్పట్లోనే ఆయన స్ట్రైక్‌ రేటు 90 అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో పాటిల్‌ యావరేజ్‌ 30.85గా ఉంది. వెస్టిండీస్‌, జింబాబ్వేపై ఆయన మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లను ఆడారు. చిరాగ్‌ పాటిల్‌ ఈ పాత్ర పోషిస్తున్నారు.


విండిస్‌పై వీర విహారం..!

1983లో యశ్‌పాల్‌ శర్మ ఆడిన మూడు ఇన్నింగ్స్‌లు భారత్‌ విజయాలకు బాటలు వేశాయి. వీటిల్లో సెమీఫైనల్‌లో చేసిన 61 పరుగులు భారత్‌ ఫైనల్స్‌కు చేరడానికి ఉపయోగపడ్డాయి. జూన్‌ 9వ తేదీన వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శర్మ బ్యాటింగ్‌ వచ్చే సమయానికి భారత్‌ 76 పరుగులకు మూడు కీలకమైన వికెట్లను పొగొట్టుకొంది. దీంతో శర్మ పరిస్థితులకు తగ్గట్లు క్రీజులో పాతుకుపోయి నిలకడగా పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో 120 బంతులు ఎదుర్కొన్న ఆయన 89 పరుగులు చేశారు.  ఆసిస్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులతో రాణించాడు. ఈ టోర్నీలో మొత్తం 34.28 సగటుతో 240 పరుగులు సాధించాడు. జతిన్‌ శర్న.. యశ్‌పాల్‌గా నటిస్తున్నారు.


‘బాల్‌ ఆఫ్‌ ది టోర్నీ’ విసిరిన బల్విందర్‌ సంధు..!

బల్విందర్‌ సంధు 1983 ఫైనల్‌లో విండిస్‌ బ్యాట్స్‌మన్‌ గోర్డన్‌ గ్రీనిడ్జ్‌కు విసిరిన కళ్లు చెదిరే ఇన్‌ స్వింగర్‌ ఆ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. అప్పటో దిగ్గజ బ్యాట్స్‌మన్‌గా పేరున్న గ్రీనిడ్జ్‌ కూడా ఆ బంతి ఆఫ్‌సైడ్‌ వెళ్లిపోతుందని తప్పుగా అంచనావేశాడు. కానీ, హఠాత్తుగా తిరిగి అది వికెట్లపైకి దూసుకొచ్చి ఆఫ్‌స్టంప్‌ బెయిల్స్‌ను ఎగరగొట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో సంధు రెండు వికెట్లు తీసుకొన్నారు. బ్యాటింగ్‌లో 11వ స్థానంలో వచ్చిన ఆయన 11 పరుగులతో నాట్‌అవుట్‌గా నిలిచారు. ఒక దశలో విండీస్‌ ఫాస్ట్‌బౌలర్‌ మాల్కమ్‌ మార్షల్‌ విసిరిన బంతి చెవికి తగిలి గాయపడ్డారు. కానీ, బాధను పంటిబిగువన అదిమి పట్టి ఇన్నింగ్స్‌ కొనసాగించారు. అమ్మి వ్రిక్‌కు బల్విందర్‌ సంధు పాత్ర దక్కింది.

జట్టుతోపాటు మేనేజర్‌ ఒక్కరే..!

అప్పట్లో ఒకే ఒక్క బీసీసీఐ అధికారి టీమ్‌ ఇండియా వెంట ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. అతని పేరు పి.ఆర్‌.మాన్‌సింగ్‌. ఆయనే టీమ్‌కు మేనేజర్‌గా వ్యవహరించారు. 83 చిత్రంలో ఈ పాత్రను పంకజ్‌ త్రిపాఠి పోషించారు. 

Read latest Sports News and Telugu News


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని