Published : 19/10/2020 14:51 IST

గెలిస్తే ముందుకు.. ఓడితే ఇంటికి..

నేడు చెన్నై, రాజస్థాన్‌ మధ్య మ్యాచ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పటివరకూ ఒక మ్యాచ్‌ ఓడినా.. మరో మ్యాచ్‌లో‌ చూసుకోవచ్చు అనే భావన ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. గెలిచిన జట్టు ముందుకు వెళితే.. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సిందే. ప్రతి పాయింట్‌ కీలకమే. రన్‌రేట్‌ కూడా తెరపైకి వచ్చి ప్లేఆఫ్స్ జట్లను ఖరారు చేసే పరిస్థితులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీలో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండు జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. ఈ రోజు రాత్రి 7.30గంటలకు చెన్నై, రాజస్థాన్‌ జట్ల మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలు ఓసారి తెలుసుకుందాం..!

గతం చెన్నైది.. ప్రస్తుతం రాజస్థాన్‌ది..
చెన్నై, రాజస్థాన్‌ ఇప్పటి వరకూ 22 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 14 విజయాలతో చెన్నైదే ఆధిపత్యం. రాజస్థాన్‌ కేవలం 8 మ్యాచుల్లో గెలిచింది. ఇది గతం. అయితే.. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం స్మిత్‌సేనదే పైచేయి. చెన్నై ఆడిన గత ఐదు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి.. మూడింట్లో ఓడింది. మరోవైపు రాజస్థాన్‌ ఒక మ్యాచ్‌లో గెలిచి నాలుగింట్లో ఓడింది. మరి గతంలోని ఆధిపత్యాన్ని చెన్నై మరోసారి ప్రదర్శిస్తుందా..? లేక రాజస్థాన్‌ తన పైచేయి కొనసాగిస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే. కాగా.. ఈ అబుదాబి మైదానంలో చెన్నై ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్‌ కూడా నాలుగు విజయాలను నమోదు చేసింది.

డెత్‌ ఓవర్లు వేసేదెవరు..?
గత మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ఓడి త్రుటిలో మ్యాచ్‌ కోల్పోయిన చెన్నై ఈ మ్యాచ్‌లో పట్టుదలతో రంగంలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు బాగానే రాణిస్తున్నారు. రాయుడు సైతం నమ్మదగిన ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ఆఖర్లో జడేజా మంచి ఫినిషింగ్‌ ఇస్తున్నాడు. ధోనీ, కేదార్‌ జాదవ్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జాదవ్‌ పోషిస్తున్న పాత్ర ఏంటీ అన్నది ఎవరికీ అర్థంకాని ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా.. గాయంతో ఆల్‌రౌండర్‌ బ్రావో దూరం అయ్యాడు. దీంతో ఆ జట్టులో డెత్‌ ఓవర్లలో‌ బౌలింగ్‌ స్పెషలిస్టు లోటు ఏర్పడింది. ఈ కారణంగా చెన్నై ఇప్పటికే ఒక మ్యాచ్‌ను కోల్పోయింది. బ్రావో స్థానంలో లుంగీఎంగిడీని తీసుకునే అవకాశాలున్నాయి. గత మ్యాచ్‌లో విఫలమైన సామ్‌ కరన్‌ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విజృంభిస్తే చెన్నై తేలిగ్గా గెలుస్తుంది.

ఒక్క మ్యాచ్‌.. మూడు రికార్డులు
టీ20 లీగ్‌లో ఇది ధోనీకి 200వ మ్యాచ్‌. ఒక ఔట్‌ చేస్తే.. 150 ఔట్లు. మరో 6 పరుగులు చేస్తే 4,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. మహీ మూడు రికార్డులకు చేరువలో ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ధోనీపైనే అందరి దృష్టి నెలకొంది.

గందరగోళంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌
రాజస్థాన్‌లో నాణ్యమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉంది. కానీ.. ఎవర్ని ఎప్పుడు పంపించాలో అర్థంకాని పరిస్థితి. ఉతప్ప ఫామ్‌ అందుకోవడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. అయితే.. ఈ మ్యాచ్‌లో ఉతప్ప, బెన్‌స్టోక్స్‌ను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు తీసుకొస్తారనేది కీలకంగా మారనుంది. ఎందుకంటే.. మంచి ఓపెనర్‌గా పేరున్న ఉతప్పను ఫినిషర్‌గా.. మంచి ఫినిషర్‌గా పేరున్న స్టోక్స్‌ను ఓపెనర్‌గా పంపించడం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. జట్టులో సమష్టితత్వం లోపించింది. మధ్య ఓవర్లలో వికెట్లు రాలిపోతున్నాయి. దీంతో ఆ జట్టు బౌలర్ల శ్రమ వృథా అవుతోంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆ జట్టు బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ ఏమాత్రం రాణించడం లేదు. గత మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఉనద్కత్‌ ఉంటాడా.. లేదా..? అనేది కూడా ప్రశ్నార్థకమే. మరోసారి సంజు తన బ్యాట్‌కు పని చెబితే రాజస్థాన్‌ గెలుపు సాధ్యమే.

జట్లు (అంచనాలు)
చెన్నై: సామ్ కరన్, వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, కేదార్‌ జాదవ్‌/పీయూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్, కరన్ శర్మ, లుంగీ ఎంగిడి

రాజస్థాన్‌: బట్లర్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), బెన్‌ స్టోక్స్‌, సంజు శాంసన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, కార్తిక్ త్యాగి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని