ఐపీఎల్‌లో ఈ మార్పులు ఖాయం: ద్రవిడ్‌

పోటీ, నాణ్యత లోపించకుండా టీ20 లీగ్‌లో జట్ల సంఖ్య మరిన్ని పెరుగుతాయని జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ అన్నాడు. ప్రతిభ పరంగా చూస్తే లీగ్‌ విస్తరణకు సిద్ధంగా ఉందని తెలిపాడు

Published : 15 Nov 2020 03:25 IST

ఇంటర్నెట్‌డెస్క్: పోటీ, నాణ్యత లోపించకుండా ఐపీఎల్‌లో జట్ల సంఖ్య మరిన్ని పెరుగుతాయని జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ అన్నాడు. ప్రతిభ పరంగా చూస్తే లీగ్‌ విస్తరణకు సిద్ధంగా ఉందని తెలిపాడు. కొత్త జట్ల రాకతో అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న నైపుణ్యమున్న ఆటగాళ్లకు లాభం చేకూరుతుందని పేర్కొన్నాడు. రాజస్థాన్ జట్టు సహయజమాని బడాలే రచించిన ‘ఎ న్యూ ఇన్నింగ్స్‌’ పుస్తకాన్ని వర్చువల్‌గా ఆవిష్కరిస్తూ ద్రవిడ్‌ మాట్లాడాడు.

‘‘గతంలో రంజీ ట్రోఫీకి ఎంపిక అవ్వాలంటే రాష్ట్ర సంఘూలపై ఆధారపడాల్సి ఉండేది. ప్రస్తుతం ఆటగాళ్ల ప్రతిభ తెలియజేయడానికి రాష్ట్ర సంఘాలే మార్గం కాదు. అంతేగాక లీగ్‌ వల్ల యువకులకు ఎంతో మేలు కలుగుతుంది. కోచ్‌లుగా యువ ఆటగాళ్లకు వాళ్ల ప్రయాణంలో సాయం చేస్తాం. కానీ ఆటలో ఎదుగుదల అనుభవంతోనే వస్తుంది. దేవదత్‌ పడిక్కల్‌ను చూడండి. విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్‌ చేస్తూ లేదా డివిలియర్స్‌ను చూస్తూ మెరుగవుతున్నాడు. అలాగే నటరాజన్ కూడా. యార్కర్లపై ఎంతో శ్రమించాడు. ఇప్పుడు ఆ ఒక్క నైపుణ్యంతోనే భారత జట్టులో చోటు సంపాదించాడు’’ అని  ద్రవిడ్‌ వెల్లడించాడు.

లీగ్‌ వల్ల వైట్‌ బాల్‌ క్రికెట్‌లో టీమిండియా ఎంతో మెరుగయ్యిందని ద్రవిడ్‌ తెలిపాడు. 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌లో సెమీస్, ఫైనల్స్‌కు వెళ్లడంలో లీగ్‌ దోహదపడిందని అభిప్రాయపడ్డాడు. లీగ్‌ 2021 సీజన్‌లో ఎనిమిది జట్లకు బదులుగా తొమ్మిది జట్లను ఆడించాలని బీసీసీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2023 సీజన్‌కు పది జట్లతో లీగ్ జరిపించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని