కోహ్లీపై న్యూజిలాండ్‌ వెబ్‌సైట్‌ మీమ్‌.. అభిమానుల ఫైర్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలయ్యాక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని న్యూజిలాండ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌ దారుణంగా అవమానించింది. కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీని ఔట్ చేసిన సంగతి తెలిసిందే...

Published : 26 Jun 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమి పాలయ్యాక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని న్యూజిలాండ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌ దారుణంగా అవమానించింది. కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీని ఔట్ చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత సారథిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతడు.. రెండోసారి ఔట్‌ స్వింగ్‌ బంతి వేసి వికెట్ల వెనుక కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చేలా చేశాడు. దాంతో పలువురు నెటిజెన్లు సైతం కోహ్లీపై పలు మీమ్స్‌ రూపొందించి సరదాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అయితే, న్యూజిలాండ్‌కు చెందిన ‘Thaccnz’ అనే క్రీడా సమాచార వెబ్‌సైట్‌ ఒక అడుగు ముందుకేసి అత్యుత్సాహం ప్రదర్శించింది.

ఓ మహిళ ఒక పురుషుడిని తాడుతో కట్టేసి పట్టుకున్నట్లున్న ఫొటోను తీసుకొని, దానిపై ఆ వ్యక్తికి కోహ్లీ పేరు.. ఆ తాడు పట్టుకున్న మహిళకు జేమీసన్‌ పేరు పెట్టింది. అది చూడ్డానికి చాలా అవమానకరంగా ఉండటంతో భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. న్యూజిలాండ్‌ జట్టు ఆటగాళ్లకున్న హుందాతనం.. అక్కడి ప్రసార మాధ్యమాలకు లేకపోయిందని తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాగైతే మరో ఖాతా చూసుకోవాల్సిందేనంటూ హెచ్చరిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

భారత అభిమానులు పెట్టిన కామెంట్లు..

* ఈ పోస్టు చేసినందుకు మీరు ఇప్పుడు ఇంకో బ్యాకప్‌ అకౌంట్‌ ఏర్పాటు చేసుకోవాలి.

* ఈ పోస్టును అర్థం చేసుకోగలం. అయితే.. వాట్లింగ్‌ షమి విషయంలోనూ ఇలాగే చేయాల్సింది.

* ఈ పోస్టులో జేమీసన్‌ చాలా అందంగా ఉన్నాడు. అయితే, అతడు మహిళ అని ఇప్పటివరకు తెలీదు.

* ఈ పోస్టు భారత్‌లో వైరల్‌ అయితే, తర్వాత ఈ ఖాతా ఉంటుందా?

* మేం జేమీసన్‌ను అభినందిస్తాం. కానీ, మీ పనికిమాలిన సిబ్బందిని చూస్తుంటే కోపం వస్తోంది.

* కోహ్లీ, ఆర్సీబీ వల్లే తన లైఫ్‌ మారిందని జేమీసన్‌ ఇదివరకే చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని