IPL 2022: ఐపీఎల్ x దక్షిణాఫ్రికా.. మెగా టోర్నీకి ముందు కొత్త వివాదం?

బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సిరీస్‌ను కాదని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడేందుకే మొగ్గు చూపడంపై సరికొత్త వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది. మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా...

Published : 18 Mar 2022 16:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సిరీస్‌ను కాదని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడేందుకే మొగ్గు చూపడంపై సరికొత్త వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది. మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఇదే విషయంపై తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్లో స్పందించాడు. ఒక ఫ్రాంఛైజీ క్రికెట్‌ క్లబ్‌ ఒక దేశ క్రికెట్‌ బోర్డునే భయపెట్టే స్థితికి చేరిందా అనే సందేహం వెలిబుచ్చాడు. ‘దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇలా చేయడం ద్వారా ఒక దేశ క్రికెట్‌ బోర్డు కన్నా క్లబ్‌ క్రికెట్టే గొప్పదా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఇదివరకే ఆ జట్టు సారథి డీన్‌ ఎల్గర్‌.. బంగ్లాదేశ్‌ పర్యటన అనేది దక్షిణాఫ్రికా ఆటగాళ్ల నిబద్ధతకు పరీక్ష లాంటిదని వ్యాఖ్యానించాడు. అయినా, వారు ఐపీఎల్‌ ఆడేందుకే మొగ్గు చూపారు. అంటే ఐపీఎల్‌ ఒక దేశ క్రికెట్‌ బోర్డునే బెదిరించే స్థాయికి ఎదిగిందా’ అని ఘాటుగా స్పందించాడు.

అయితే, ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి పాత్ర పోషించదని చోప్రా స్పష్టం చేశాడు. అలాగే దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తమ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతిస్తే.. (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌‌) వారికి వచ్చే ఆదాయంలో పది శాతం ఆ బోర్డుకు వెళ్తుందని చెప్పాడు. ఒక విధంగా బీసీసీఐ సైతం ఇలాగే వ్యవహరిస్తోందని వెల్లడించాడు. ఇటీవల జరిగిన పలు అంతర్జాతీయ సిరీసుల్లో బీసీసీఐ కూడా పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిందని, కానీ, వారికి ఐపీఎల్‌లో పూర్తి సీజన్‌ ఆడేందుకు అనుమతిచ్చిందని చోప్రా వివరించాడు. ఈ నేపథ్యంలో క్లబ్‌ క్రికెట్‌ గొప్పదా, దేశ క్రికెట్‌ బోర్డు గొప్పదా అంటే.. ఈ వివాదం ఎప్పటికీ తేలదని చెప్పాడు. ఐపీఎల్‌ ఆడాలా వద్దా అనే విషయంలో ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకురాకూడదని సూచించాడు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ఆటగాళ్లు ఇతర లీగులు ఆడాలా వద్దా అనే దాన్ని ఏ బోర్డూ ఆపలేదని మాజీ ఓపెనర్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని