MS Dhoni: ఆసీస్-విండీస్‌ మ్యాచ్ కామెంట్రీలో ధోనీ బ్యాట్‌పై చర్చ!

ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఏం చేసినా నెట్టింట చర్చకు దారి తీస్తుంది. ప్రాక్టీస్‌ సందర్భంగా వాడిన బ్యాట్‌ కూడా వైరల్‌గా మారింది.

Updated : 14 Feb 2024 13:39 IST

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో ఐపీఎల్ 2024 ఎడిషన్‌ (IPL 2024) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రాక్టీస్‌ మొదలెట్టేశాడు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. అందులో వాడిన బ్యాట్‌ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా- వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ సందర్భంగానూ కామెంట్రీ బాక్స్‌లో వ్యాఖ్యాతలు మాట్లాడుకోవడం విశేషం. ఆసీస్‌ మాజీ క్రికెటర్లు గిల్‌క్రిస్ట్, మైకెల్ హస్సీ ఐపీఎల్‌ గురించి చర్చించారు. హస్సీ సీఎస్‌కే తరఫున ఆడిన విషయం తెలిసిందే. 

‘‘ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి పది రోజులు ముందే భారత్‌కు వెళ్తా. మార్చి రెండో వారం నుంచి ఉండొచ్చని తెలుస్తోంది. దాని కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లు ఆ టోర్నీలో ఆడుతున్నారు. భారత్‌ నుంచి యువ క్రికెటర్లకూ మంచి అవకాశం. మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తారు. వారు చేసే సందడి అద్భుతంగా ఉంటుంది. ఎంఎస్ ధోనీ ఈ ఎడిషన్‌ కోసం సిద్ధమవుతున్నాడు. నెట్స్‌లో ఇప్పటికే సాధన మొదలు పెట్టాడు’’ అని హస్సీ వ్యాఖ్యానించాడు. 

ఆ స్టిక్కర్‌ను చూశా: గిల్‌క్రిస్ట్‌

‘‘నెట్స్‌లో ఎంఎస్ ధోనీ సాధన చేయడం చూశా. అతడు వాడిన కొత్త బ్యాట్‌పై స్టిక్కర్లను గమనించా. స్థానికంగా ఉండే స్పోర్ట్స్‌ స్టోర్‌కు సంబంధించినది. ధోనీ పాఠశాల సహచరుడు ఆ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. అమ్మకాలను పెంచేందుకు తనవంతు సాయంగా ధోనీ ఆ స్టిక్కర్లను తన వాడే బ్యాట్‌పై అతికించాడు’’ అని గిల్‌క్రిస్ట్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని