World Cup: ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌.. ఆగ్రహంతో ఊగిపోయిన అఫ్గాన్‌ ప్లేయర్‌కు ఐసీసీ మందలింపు

ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియామవళిని ఉల్లఘించిన అఫ్గానిస్థాన్‌ ఓపెనర్ రహ్మనుల్లా గుర్భాజ్‌ను ఐసీసీ (ICC) మందలించింది. 

Updated : 17 Oct 2023 19:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు అఫ్గానిస్థాన్‌ (Afghanistan) గట్టిషాకిచ్చిన సంగతి తెలిసిందే. అఫ్గాన్‌ నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 215 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ రహ్మనుల్లా గుర్భాజ్‌ (Rahmanullah Gurbaz) (80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)ను ఐసీసీ (ICC) మందలించింది.  అతడు మ్యాచ్ సమయంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లఘించడమే ఇందుకు గల కారణం. ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని లెవల్‌ 1ను గుర్భాజ్‌ ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చి మందలించింది. ఒక ఆటగాడి ఖాతాలో 24 నెలల కాలవ్యవధిలో నాలుగు డీమెరిట్‌ పాయింట్లు చేరితే సదరు ప్లేయర్‌పై సస్పెన్షన్ విధిస్తారు. ఐసీసీ విధించిన శిక్షను గుర్భాజ్‌ అంగీకరించాడు.

అసలేం జరిగిందంటే.. సెంచరీకి చేరువైన క్రమంలో గుర్భాజ్‌ 19వ ఓవర్‌లో రనౌటయ్యాడు. నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌ నుంచి పరుగెత్తిన గుర్భాజ్‌ డైవ్‌ చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ప్రపంచకప్‌లో సెంచరీ చేసే అవకాశం చేజారడంతో తీవ్ర నిరాశకు గురై ఆగ్రహంతో ఊగిపోయాడు. గ్రౌండ్‌పై బ్యాట్‌ను కోపంగా కొట్టాడు. మైదానం నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్తున్న క్రమంలో బౌండరీ లైన్‌, పక్కన ఉన్న కుర్చీని బ్యాట్‌తో బలంగా బాదాడు. ఈ క్రమంలోనే గుర్భాజ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని