Ajinkya Rahane: మళ్లీ కౌంటీల్లో ఆడనున్న అజింక్య రహానె.. లీసెస్టర్‌షైర్‌ తరఫున బరిలోకి

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో టెస్టుల్లోకి పునరాగమనం చేసిన భారత సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె (Ajinkya Rahane) త్వరలో కౌంటీల్లో ఆడనున్నాడు.

Published : 18 Jun 2023 16:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో టెస్టుల్లోకి పునరాగమనం చేసిన భారత సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె (Ajinkya Rahane) త్వరలో కౌంటీల్లో ఆడనున్నాడు. జులైలో వెస్టిండీస్‌తో భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత రహానె ఇంగ్లాండ్ వెళ్లి లీసెస్టర్‌షైర్‌ (Leicestershire) తరఫున ఆడనున్నాడు. రహానె జనవరిలో లీసెస్టర్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ ముగిసిన వెంటనే రహానె ఇంగ్లాండ్ వెళ్లి ఎనిమిది ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌లు, రాయల్‌ లండన్‌ కప్‌ (50 ఓవర్ల దేశవాళీ టోర్నమెంట్)లో మొత్తం మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. కానీ, టెస్టుల్లోకి పునరాగమనం చేయడంతో యూకేకు వెళ్లలేదు. 

‘‘వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ముగియగానే  రహానె ఇంగ్లాండ్ బయలుదేరుతాడు. లీసెస్టర్‌షైర్‌ జట్టుతో చేరి మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. ఆగస్టులో జరిగే రాయల్ లండన్‌ కప్‌లో ఆడతాడు. భారత్‌ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు భాగమయ్యే అవకాశాలు లేనందున సెప్టెంబరులో నాలుగు కౌంటీ మ్యాచ్‌లు ఆడే ఛాన్స్‌ ఉంది’’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి. రహానె కౌంటీల్లో ఆడటం ఇది రెండోసారి. 2019లో హాంప్‌షైర్‌ తరఫున ఆడాడు.ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రహానె 89 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 5,000 పరుగుల మైలురాయిని (83 టెస్టుల్లో) దాటాడు. ఈ నెలాఖరులో టీమ్‌ఇండియా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. జులైలో విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12న టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని